జిల్లాలో యథేచ్ఛగా నకిలీ విత్తనాల దందా
బేల, జూలై 3 , (విజయక్రాంతి) : జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా చలామణి అవుతున్న నకిలీ విత్తనాలు అన్నదాతలకు శాపంగా మారుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు అమాయక రైతులను ఆసరా చేసుకొని నకిలీ విత్తనాలు అంటగడుతూ సొమ్ముచేసు కుంటున్నారు. ఆలస్యంగా వారి మోసాన్ని గుర్తించిన రైతులు లబోదిబో మంటున్నారు. బేల మండలం కాప్సి గ్రామంలో పలువురు రైతులు నాటిన సోయా విత్తనాలు మొలకెత్తక దిక్కుతోచని స్థితిలో రైతులు పడిపోయారు.
ఈ యేడాది మాళవిక రకం సోయా విత్తనం వేసిన పలువురు రైతులు అవి మొలకెత్తక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన 25 మంది రైతులు దాదాపు వంద ఎకరాల్లో కొంత భాగం మాళవిక రకం విత్తనం వేయగా.. మరికొంత భాగంలో ఇతర రకం విత్తనాలు నాటారు. అయితే మాళవిక రకం విత్తనాలు ఏమాత్రం మొలకెత్తకపోవడంతో విత్తనాల కోసం చేసిన అప్పులు భారంగా మారనుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు తమ వ్యవసాయ పొలాల్లో మొలకెత్తని విత్తనాల వైపు దిగాలుగా చూస్తూ ఆవేదన చెందుతున్నారు. మళ్లీ విత్తనాల కోసం అప్పుదొరక్క ఇబ్బందులు పడుతున్నారు.అధికారులు పట్టించుకోక పోవడంతోనే నకిలీ విత్తనాలు మార్కెట్ లో యదేచ్చగా విక్రయాలు సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు తమ పంట చేలను పరిశీలించాలని.. నకిలీ విత్తన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.






