11-01-2026 12:47:22 AM
అరుదుగా కన్పిస్తున్న గంగిరెద్దుల విన్యాసాలు
ఆధునిక సమాజంలో ఆదరణలేక కళాకారుల వలసబాట
కళ తప్పుతున్న సంక్రాంతి
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పది రోజుల ముందు నుంచే గంగి రెద్దుల నాట్యాలు, హరిదాసుల సంకీర్తనలు, ఇళ్ల ముంగిట రంగవళ్లులు, వాటి మధ్య గొబ్బెమ్మలు, వెరసి పచ్చటి పల్లెల్లో సంబురం వెల్లివిరుస్తుండేది. ఇదంతా ఒకప్పటి మాట. ఆధునిక యుగంలో, హడావిడి జీవనంలో సంస్కృతి, సంప్రదాయాలు ఆదరణ కోల్పోతున్నాయి. సంక్రాతి సమీపిస్తున్నా నేడు పల్లెల్లో గంగిరెద్దులు కనిపించడం లేదు. హరిదాసుల సంకీర్తనలు వినిపించడం లేదు. అందరూ సెల్‌ఫోన్లలో కబుర్లు, ఇంటర్నెట్, వాట్సాప్ చాటింగ్‌లకే పరిమితం అవుతున్నారు. దీంతో కనుమరుగవుతున్న నాటి సంక్రాంతి సంప్రదాయాలపై.. ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం..
మణుగూరు, జనవరి 10 (విజయక్రాంతి): ‘డూ..డూ.. బసవన్నా ఇటు రారా.. అమ్మవారికి దండం పెట్టు, అయ్య వారికి దండం పెట్టు’ అంటూ గంగిరెద్దులాట మన సంస్కృతిలో ఓ భాగం. తలకు పాగా ధరించి, వివిధ రకాల దుస్తులను ధరించి, బూర ఊదుకుంటూ గంగిరెద్దుల ను తీసుకొస్తారు. అందంగా అలంకరించిన గంగిరెద్దును తీసుకుని ఇంటింటికీ వెళ్లి వారి వంశ ప్రతిష్టను కీర్తించే గంగిరెద్దుల వారికి, గ్రామాల్లో గంగిరెద్దు లాటకు రానురానూ ఆదరణ తగ్గుతోంది. ప్రస్తుతం ప్రజాదరణ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. కేవలం తమకు వచ్చే కొంత నగదుతో బసవన్నల పోషణకే తమ జీవితం సరిపోతుందని, నాటి రోజులు పూర్తిగా అదృశ్యం కావడంతో, ప్రస్తుతం ఆదరణ లేక ఇబ్బందులు తప్పట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విన్పించని హరిదాసుల సంకీర్తనలు
కాళ్లకు గజ్జెలు, తలపై అక్షయపాత్ర, ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తుంబరతో సంక్రాంతి పండుగ వేళ హరిదాసులు పల్లెల్లో హరినామ సంకీర్తనతో ప్రజలను ఆనందపరుస్తారు. ఇది తెలుగు సంప్రదాయం. రామాయణం, మహాభారతంలోని శ్లోకాలు, ప్రధాన ఘట్టాలను వివరించడం హరిదాసుల ప్రత్యేకత. ప్రజలు అక్షయపాత్రలో బియ్యం, కూరగాయలు, డబ్బులను వేసి హరిదాసుడి ఆశీర్వాదం పొందుతారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఉండడంతో గ్రామాల్లో హరిదాసుల సంకీర్తనలు మచ్చుకైనా వినిపించడం లేదు. అక్కడక్కడా కొందరు దర్శనం ఇస్తున్నారే తప్ప దాదాపు వారి జాడ కూడా కనపడడం లేదు.
కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలు
సంస్కృతీ సాంప్రదాయానికి అద్దం పట్టే పండుగ సంక్రాంతి. రెండు దశాబ్దాల ముందు వరకు సంక్రాంతి వచ్చిందంటే పది రోజుల ముందు నుంచే పల్లెల్లో బంధుమిత్రులతో హడావిడి ఉండేది. ఎద్దుల కొమ్ములకు రంగులు వేసి, గ్రామంలో పందెపు బండలు, రంగురంగుల పతంగులతో సందడి ఉండేది. కానీ నేటి ఆధునిక యుగంలో యువతకు ఇవేమీ కనిపించడం లేదు. వాటిని విన్నామే తప్ప చూడలేదని, ఇవన్నీ ఇంటర్నెట్లో చూస్తున్నాం. పండగకు పది రోజుల పాటు గ్రామాల్లో గడపడమంటే కుదరని పని అంటున్నారు. ఇలాంటి పరిస్థితికి నేడు మనమొచ్చాం. ఒక్కసారి మనమేం మర్చిపోతున్నామో ఈ సంక్రాంతి పండుగ కైనా గుర్తుచేసుకుందాం.