11-01-2026 01:00:33 AM
అమరావతి, జనవరి 10: కాళేశ్వరానికి లేని అభ్యంతరం నల్లమల సాగర్‌కు ఎందు కు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లకు తాను అ డ్డు చెప్పలేదని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు నీటిని సమృద్ధిగా వాడుకొని అభివృద్ధి చెందాలన్నారు. వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను తాము బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు వినియోగించుకుంటే అభ్యంతరం చెప్పొద్దని చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నీటి విషయంలో గొడవలు పడితే నష్టపోయేది తెలుగు ప్రజలేనన్నారు. అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల యం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియా తో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఉభయ రా ష్ట్రాలు సుభిక్షంగా ఉండేలా చూడటం తప్పె లా అవుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నీటి విషయంలో రాజీపడేది లేదని సీఎం మరోసారి స్పష్టం చేశారు.
తెలంగాణతో మాకు ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటాం.. రాజకీయాల కోసం సెంటిమెంట్లు రెచ్చగొట్టం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు పట్టి సీమ ద్వారా నీరందించామన్నారు. ఆ ప్రాజెక్టు వల్లే ఉద్యానరంగం అభివృద్ధి చెందిందన్నారు.పూర్తి చేయకుండా 2020 లోనే నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్‌తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేవలం మట్టిపనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారన్నారు. నాగరికత ఎక్కడ మొదలైందో జగన్‌కి తెలియద న్నారు. నదులు ఎక్కడ పుడతాయో, నాగరిక ఎక్కడ మొదలైందో జగన్‌కి తెలియదన్నారు. నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడన్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలు నదీతీరాల వెంబడి ఉన్నందునే అభివృద్ధి చెందాయన్నారు.