20-01-2026 01:39:32 AM
విభిన్నమైన పాత్రల్లో మెరిసి, అభిమానులకు నేషనల్ క్రష్‌గా మారింది రష్మిక మందన్న. తెరపైనే కాదు.. వీలు చిక్కినప్పుడల్లా అభిమానులతో ముచ్చటించడం ఈ స్టార్ బ్యూటీకి అలవాటు. తాజాగా ఓ చిట్‌చాట్‌లో రష్మిక పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. “నేను 2016 నుంచి ఇప్పటిదాకా ఒకేలా పనిచేస్తున్నా. భాషాపరమైన హద్దులేవీ లేకుండా, సినిమాలు విభిన్నంగా ఉండేటట్లు చూసుకుంటున్నా. ఇకపై కూడా ఇట్లనే డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటా. నాకు అన్నిరకాల సినిమాల్లో నటించాలనుంది. నేను హీరోయిన్‌ని.. ప్రేక్షకులకు వినోదం పంచడమే నా పని. అందరికీ నచ్చే చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తుంటా. కొందరు వ్యూస్, డబ్బు కోసం ఏదేదో రాస్తరు. వాస్తవానికి అలాంటి వార్తలు కూడా ఎంతోమందిని జీవనాధారంగా మారాయి. అందుకే నేను బతకనీ అని వదిలేస్తా. ఇండస్ట్రీలో ఉన్నవారు నెగెటివిటీ ఎదుర్కోవటం కామన్.
ఒకప్పుడు రూమర్స్ విని ఎంతో బాధ పడేదాన్ని. ఇప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా. జీవితంలో ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకుసాగుతున్నా. ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిని నేనే అనేది కేవలం అపోహ. నేనేం హీరోను కాదు, ఎక్కువ తీసుకోవడానికి. అది నిజమైతే బాగుండు అని నేనూ ఎదురుచూస్తున్నా. నేను స్పెషల్ సాంగ్స్ చేయడానికి రెడీ. కాకపోతే ఆ సినిమాలో నేనే కథానాయికనై ఉండాలి. లేదంటే ఇండస్ట్రీలో ముగ్గురు దర్శకులున్నారు (పేర్లు చెప్పలేదు).. వాళ్లు అడిగితే తప్పకుండా లీడ్ రోల్ కాకపోయినా వాళ్ల సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటిస్తా” అని తెలిపింది. రష్మిక ప్రస్తుతం ‘మైసా’లో నటిస్తోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది.
రష్మిక శక్తిమంతమైన ఆదివాసీ యువతి పాత్రలో కనిపించనుంది. ఇక ‘పుష్ప3: ది రాంపేజ్’లో శ్రీవల్లిగా రష్మిక మళ్లీ అలరించబోతోంది. ఇక బాలీవుడ్‌లో ‘కాక్ టెయిల్2’లో షాహిద్ కపూర్, కృతి సనన్‌తోపాటు రష్మిక నటిస్తోంది. మరో బాలీవుడ్ చిత్రం ‘బోర్డర్2’లో రష్మిక ఒక కీలక పాత్ర పోషిస్తోంది. శాంతరూబన్ దర్శకత్వంలో దేవ్ మోహన్ సరసన రష్మిక నటిస్తున్న రొమాంటిక్ ఫాంటసీ చిత్రం ‘రెయిన్‌బో’ విడుదల కావాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్ పార్క్’లో రష్మికను మరోసారి రణబీర్ కపూర్‌కు జంటగా చూడొచ్చు. ఇక టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండతో మరోసారి రొమాన్స్ చేయనుంది రష్మిక.