ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో
- మంత్రి మెప్పుకోసం రైతులను బూతులు తిట్టిన సర్పంచ్..?
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు వారు పండించిన ధాన్యం అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. శనివారం జైపూర్ మండలం ఇందారం గ్రామంలో రాజీవ్ గాంధీ రాష్ట్రీయ రహదారిపై రైతులు దాన్యం కొనాలని, కోతలు విధించవద్దంటూ రాస్తారోకో నిర్వహించారు. కోతలు కోసి నెలలు గడుస్తున్న కాంటాలు కావడంలేదని, కాంట చేసిన మిల్లుకు సరైన సమయంలో తరలించడం లేదని, అష్ట కష్టాలు పడి మిల్లుకు పంపితే బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోలు కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తూ రైతన్నలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని, జైపూర్ మండలం శెట్పల్లి గ్రామంలో నడుస్తున్న మిల్లు సైతం మంత్రి అనుచరుడిది కావడంతో మంత్రి పేరు చెప్పి రైతులను నిలువునా దోస్తున్నాడని మండిపడ్డారు. అధికారులు సైతం ఈయన విషయంలో జోక్యం చేసుకోవడం లేదని, దీంతో రైతులు క్వింటాల్ కి 10 కిలోల పైననే నష్టపోవాల్సి వస్తుందని, ఇదంతా సర్పంచులు కూడా తెలిసే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సపోర్టుగా ఉండాల్సిన నాయకులు నీళ్లతో కుమ్మక్కై నట్టేట ముంచుతున్నారని, ఇక్కడ రైతులు కష్టాలు పడుతుంటే ఈ సమాచారం ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి పోనివ్వడం లేదని, ఇక చేసేది ఏమి లేక రోడ్డు ఎక్కి నిరసన తెలుపవలసిన పరిస్థితి దాపురించిందన్నారు.
మంత్రి మెప్పుకోసం రైతులను బూతులు తిట్టిన సర్పంచ్..?
మంత్రి ఇలాకాలో రైతులు రోడ్డు ఎక్కడంతో అది తట్టుకోలేక ఇందారం గ్రామ సర్పంచ్ ఫయాజ్ ఖాన్ రైతులు చేస్తున్న రాస్తారోకోను విచ్ఛిన్నం చేయడం కోసమే రైతులను బండబూతులు తిట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కడుపు మండి రోడ్డు ఎక్కితే సర్పంచ్ అతి ఉత్సాహం ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా నిలవాల్సిన నాయకులు మంత్రి మెప్పు కోసం రైతులను తిడుతూ ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారని దుయ్యబడ్డారు. గంటపాటు రాస్తారోకో జరగడంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ నవీన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని మీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.






