02-07-2025 12:44:31 PM
మహిళతో వివాహేతర సంబంధం బలైన పేద కుటుంబం.
అనాధలుగా మారిన ముగ్గురు చిన్నారులు.
బిజినపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): బిజినపల్లి మండలంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడి రాసలీలలు బయటపడ్డాయి. రేషన్ డీలర్గా కొనసాగుతూనే తన పరపతిని ప్రదర్శిస్తూ తనకు కంటికి నచ్చిన మహిళలను లోబర్చుకుంటూ వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నాడు. ఈ తరుణంలో ఓ మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధం తీరా ఆ మహిళ భర్త మృతికి కారణమైంది. ఇద్దరూ ఒంటరిగా కలిసి ఉన్నప్పుడు గమనించిన ఆ భర్త ఆ పొలిటికల్ నేతను మందలించడంతో తన పైనే దాడులు చేయించి బెదిరింపులకు పాల్పడ్డాడు.
దీంతో మనస్థాపం చెందిన భర్త గత నెల 24న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. తన ముగ్గురు పిల్లలు అనాధలుగా మారారు. రాసలీలల విషయం కాస్త బయటకు పొక్కడంతో బాధితురాలి భర్త మరణానికి రేటు కట్టినట్లు తెలుస్తోంది. ముగ్గురు పిల్లల పేర ఐదు లక్షలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో పాటు మరో ఐదు లక్షలు ఖర్చులకి, భర్త మృతి చెందిన ఖర్చులు మరో లక్ష చొప్పున మొత్తంగా 21 లక్షలు రేటు నిర్ణయించి చేసిన పాపాన్ని కడిగేసుకున్నట్లు మండలంలో చర్చ నడుస్తోంది.
బ్యానర్ల తొలగింపు..!
తెర ముందు ప్రజా సేవ చేస్తున్నట్లు కటింగ్ ఇస్తూ తమ నేతల పుట్టినరోజు వేడుకలకు ఫోటోలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ ఉత్తముడిలా నటించే సదురు నేత తెరవెనక చేసే రాసలీలలు బయటపడడంతో ఆ పార్టీ నేతలు వెంటనే తెరుకున్నారు. తమ ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్ని వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు వెనువెంటనే తొలగించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.