03-07-2025 01:56:51 AM
న్యూఢిల్లీ, జూలై 2: కరోనా మహమ్మారి తర్వాత దేశంలో కార్డియాక్ అరెస్టులు పెరుగుతూ వస్తున్నాయి. కొవిడ్ టీకాలు తీసుకోవడం వల్లే అధిక గుండెపోట్లు సంభవిస్తున్నాయని గతంలోనూ పలు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆకస్మిక మరణాలకు కొవిడ్ టీకాలతో సంబంధం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలినట్టు స్పష్టం చేశాయి.
మునుపటి ఆరోగ్య సమస్యలు, మారుతున్న జీవన శైలి, జన్యుపరమైన మార్పులే హఠాత్తు మరణాలకు ప్రధాన కారణాలని తమ నివేదికలో వెల్లడించాయి. ఈ మేరకు అధ్యయనాల నివేదికను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో ఆకస్మిక మరణాలు సంభవిస్తుండటంతో ఐసీఎంఆర్, ఎన్‌సీడీ సహా ఎయిమ్స్ కూడా ఈ వయసు వారిపై తమ పరిశోధనలు చేశాయి.
2023 మే- ఆగస్టుమధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పలు ఆసుపత్రుల్లో సర్వే నిర్వహించాయి. ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య అకస్మాత్తుగా మరణించిన వారి వివరాలను పరిశీలించాయి. ఈ నేపథ్యంలోనే ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్టు ఆయా సంస్థలు వెల్లడించాయి.
కొవిడ్ టీకాలు సురక్షితమైనవే..
భారత్‌లో కొవిడ్ టీకాలు సురక్షితమని, సమర్థవంతమైనవని ఐసీఎంఆర్-ఎన్‌సీడీసీ తమ అధ్యయనంలో పేర్కొంది. వీటివల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కనిపిస్తాయని తెలిపింది. గుండె సంబంధిత హఠాత్తు మరణాలకు అనేక కారణాలు ఉన్నాయని.. అవి జన్యుపరమైన సమస్యలు, మారుతున్న జీవనశైలి, మునుపటి ఆరోగ్య సమస్యల్లో ఏదైనా కావొచ్చని వెల్లడించింది.
సరైనా ఆధారాలు లేకుండా కొవిడ్ వ్యాక్సిన్లపై దుష్ప్రచారం చేయడం వల్ల టీకాలపై ప్రజలు విశ్వసనీయత కోల్పోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశాయి. కొవిడ్ టీకాలపై అనవసరఆరోపణలు ప్రజల్లో భయాన్ని నెలకొల్పే అవకాశాలున్నాయని కేంద్రం పేర్కొంది. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో గత నెలలో 20 మంది ఆకస్మికంగా మరణించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై తగిన పరిశోధనలు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది.