03-07-2025 02:33:19 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై ౨ (విజయక్రాంతి): హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. బుధవారం ఉద యం నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
లక్డీకాపూల్ మెయిన్ రోడ్డులో బుధవారం ఉదయం 8 గంటల నుంచే రద్దీ ఏర్పడింది. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట వెళ్లాల్సిన వాహనాలు కిలోమీటర్ల పొడవునా బారులు తీరాయి. సాయత్రం కేబుల్ బ్రిడ్జ్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కాగా మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు జూబ్లీహిల్స్‌లో గరిష్ఠంగా 4 సెం.మీ.ల వర్షపాతం నమోదు కాగా, మెహిదీపట్నం, లంగర్‌హౌస్ ప్రాంతా ల్లో కనిష్ఠంగా 2 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.
అర్ధరాత్రి తర్వాత సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో 0.5 సెం.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లాలో బుధవారం రోజంతా చిరుజల్లులు కురిశాయి. ముసురుతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. వాహనదారులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరో 4 రోజులు వర్షాలు
రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజులు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగా వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు చోట్ల కురుస్తాయని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీంఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడుతాయని వెల్లడించింది.