పోరాడి ఓడిన బెంగళూరు, జాక్స్, రజత్ పోరాటం వృథా, కోల్‌కతా పాంచ్ పటాకా
బెంగళూరు విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు
చేయాల్సిన దశలో దినేశ్ కార్తీక్ 4,6 కొట్టి ఔట్ కాగా.. ఆఖరి ఓవర్‌లో ఆర్సీబీ విజయ సమీకరణం 6 బంతుల్లో 21 పరుగులుగా మారింది. ఈ దశలో సీనియర్ స్పిన్నర్ కరణ్ శర్మ అదరగొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసుకున్న స్టార్క్ బౌలింగ్‌ను రఫ్ఫాడించాడు. తొలి నాలుగు బంతుల్లో మూడు సిక్సర్లు బాదడంతో.. ఇక రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే బెంగళూరు గెలిచేసేదే కానీ.. ఈ దశలో ఒత్తిడికి గురైన చాలెంజర్స్.. విజయానికి పరుగు దూరంలో నిలిచిపోయింది. బెంగళూరుకు ఐపీఎల్లో ఏదీ కలిసి రావడం లేదు.
ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగు పర్చుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఉత్కంఠ ఊపేసిన పోరులో స్టార్లు విఫలమైనా అనూహ్యంగా పుంజుకున్న బెంగళూరు.. చివరి బంతికి బోల్తా కొట్టింది. సీజన్‌లో ఇప్పటికే ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఏడింట ఓడింది. ఇక ఇక్కడి నుంచి డుప్లెసిస్ సేన ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే!
సన్‌రైజర్స్ పవర్‌ప్లే బాదుడు చూసిన ప్రతి జట్టు.. తొలి ఆరు ఓవర్లలో దంచికొట్టడమే పరమావధిగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. తాజా పోరులో కోల్‌కతా ఓపెనర్ ఫిల్‌సాల్ట్ కూడా పూనకం వచ్చినవాడిలా బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 14 బంతుల్లో 48 పరుగులు చేయగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రస్సెల్ రాణించడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. ఛేదనలో చేజ్‌మాస్టర్ విరాట్ కోహ్లీ సందేహాస్పద నిర్ణయానికి వెనుదిరగగా.. విల్ జాక్స్, రజత్ పాటిదార్ పోరాడినా ఫలితం లేకపోయింది.
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. సీజన్‌లో గెలుపు ముఖం చూసి చాలా రోజులైన బెంగళూరు.. వరుసగా ఆరో ఓటమి మూటగట్టుకుంది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ పరుగు తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 50; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 48; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. రింకూ సింగ్ (24; 2 ఫోర్లు, ఒక సిక్సర్), రస్సెల్ (27 నాటౌట్; 4 ఫోర్లు), రమన్‌దీప్ సింగ్ (9 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తలో చేయి వేశారు.
బెంగళూరు బౌలర్లలో కామెరూన్ గ్రీన్, యష్ దయాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. విల్ జాక్స్ (32 బంతుల్లో 55; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రజత్ పాటిదార్ (23 బంతుల్లో 52; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్‌సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (25; 3 ఫోర్లు, ఒక సిక్సర్), కరణ్ శర్మ (7 బంతుల్లో 20; 3 సిక్సర్లు) విలువైన పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 3, నరైన్, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ మెరుపులు మెరిపించిన రస్సెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. సీజన్‌లో గెలుపు ముఖం చూసి చాలా రోజులైన బెంగళూరు.. వరుసగా ఆరో ఓటమి మూటగట్టుకుంది.
స్కోరు బోర్డు
కోల్‌కతా: సాల్ట్ (సి) రజత్ (బి) సిరాజ్ 48, నరైన్ (సి) కోహ్లీ (బి) యష్ 10, రఘువంశీ (సి) గ్రీన్ (బి) యష్ 3, వెంకటేశ్ (సి) లోమ్రర్ (బి) గ్రీన్ 16, శ్రేయస్ (సి) డుప్లెసిస్ (బి) గ్రీన్ 50, రింకూ (సి) యష్ (బి) ఫెర్గూసన్ 24, రస్సెల్ (నాటౌట్) 27, రమన్‌దీప్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు: 20, మొత్తం: 20 ఓవర్లలో 222/6. వికెట్ల పతనం: 1 2 3 4 5 6 బౌలింగ్: సిరాజ్ 4 యష్ 4 ఫెర్గూసన్ 4 కరణ్ 4
గ్రీన్ 4
బెంగళూరు: కోహ్లీ (సి అండ్ బి) హర్షిత్ 18, డుప్లెసిస్ (సి) వెంకటేశ్ (బి) వరుణ్ 7, జాక్స్ (సి) రఘువంశీ (బి) రస్సెల్ 55, రజత్ (సి) హర్షిత్ (బి) రస్సెల్ 52, గ్రీన్ (సి) రమన్‌దీప్ (బి) నరైన్ 6, ప్రభుదేశాయ్ (సి) రఘువంశి (బి) హర్షిత్ 24, లోమ్రర్ (సి అండ్ బి) నరైన్ 4, కార్తీక్ (సి) సాల్ట్ (బి) రస్సెల్ 25, కరణ్ (సి అండ్ బి) స్టార్క్ 20, సిరా (నాటౌట్) 0, ఫెర్గూసన్ (రనౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 221 ఆలౌట్. వికెట్ల పతనం: 1 2 3 4 5 6 7 8 9 10 బౌలింగ్: హర్షిత్ 4 స్టార్క్ 3 వరుణ్ 4 నరైన్ 4 సుయాశ్ 2 రస్సెల్ 3