7 July, 2026 | 12:21 AM

నువ్వా.. నేనా!

18-05-2024 01:40 AM

చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢీ

ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరు?

మ్యాచ్‌కు వర్షం ముప్పు

అభిమాన గణంలో ఆ జట్టును కొట్టేవారు లేరు. ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ ప్రతీసారి బరిలోకి దిగడం.. కీలక పోరులో ఉసూరుమనిపించడం వారికి పరిపాటిగా మారిపోయింది. అయినా సరే ఆ జట్టు పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే. అయితే గడిచిన ఐపీఎల్ సీజన్లది ఒక లెక్క.. ఈ సీజన్‌లో ఒక లెక్క. వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించే తొలి జట్టు ఇదే అవుతుందేమో అన్న తరుణంలో వరుస విజయాలతో రేసులో నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.

ఆ జట్టుకు ఐపీఎల్లో ఎదురన్నది లేదు. ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఒక్కసారి ప్లేఆఫ్స్‌కు చేరిందంటే ప్రత్యర్థి జట్టు బలాన్ని మొత్తం లాగేసుకునే తత్వం. ఫైనల్లో అడుగుపెట్టిందంటే పులిలా గర్జించడం అలవాటు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక ప్లేఆఫ్స్ ఆడిన జట్టుగానూ రికార్డులకెక్కింది. ఇన్ని ఘనతలు సాధించినప్పటికి ప్రతీ సీజన్‌లో టైటిల్ వేటలో ఇదే ప్రారంభం అన్నటుగ్లా బరిలోకి దూకుతుంది చెన్నై సూపర్ కింగ్స్.

ఐపీఎల్ 17వ సీజన్‌లో మిగిలిన ఏకైక ప్లేఆఫ్ బెర్తు కోసం ఈ రెండు జట్లు గిరిగీసి కొట్లాడనున్నాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికి అవకాశం వస్తే విజృంభించడానికి ఇరుజట్లు రెడీగా ఉన్నాయి. ఒకవైపు కోహ్లీ అన్నీ తానై బెంగళూరును నడిపిస్తుండగా.. మరోవైపు ధోనీ బ్రాండ్‌ను సరిగ్గా వాడుకుంటూ చెన్నై రేసులో దూసుకుపోతుంది. ఇది బెంగళూరు వర్సెస్ చెన్నై మధ్య పోటీ అనడం కంటే ధోనీ వర్సెస్ కోహ్లీ అనడం కరెక్టేమో..!.

బెంగళూరు: ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్‌లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. మిగిలిన నాలుగో బెర్తు కోసం శనివారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమితుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరు వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. సీజన్‌లో చెన్నై 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంటే.. బెంగళూరు ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ఆరో స్థానంలో ఉంది. మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది. అదే బెంగళూరు గెలిస్తే చెన్నైతో కలిపి 14 పాయింట్లతో సమానంగా ఉంటుంది. ఈ దశలో నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. రన్‌రేట్ విషయంలో బెంగళూరుతో పోలిస్తే చెన్నై కాస్త మెరుగ్గా ఉంది. ఎటు చూసినా చెన్నైకే ఎక్కువ అవకాశాలున్నప్పటికీ మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే గనుక బెంగళూరు ముందంజ వేసే చాన్స్ ఉంది. 18 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించడం లేదంటే 18 పరుగుల తేడాతో ఓడించడం చేస్తే బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరనుంది.

మ్యాచ్‌కు వర్షం ముప్పు కూడా పొంచి ఉంది.ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు చెన్నై 15 పాయింట్లతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది. బెంగళూరు బ్యాటింగ్‌కు విరాట్ కోహ్లీ అన్నీ తానై నడిపిస్తున్నాడు. నిలకడైన ఆటతీరుతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాడు. డుప్లెసిస్, రజత్ పాటిదార్, దినేశ్ కార్తిక్‌లు సమష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది. సీజన్ ఆరంభంలో పేలవ మైన బౌలింగ్‌తో ఇబ్బందిపడ్డ బెంగళూరు ఇప్పుడు మాత్రం పటిష్టంగా కనిపిస్తోంది. ఇక చెన్నై బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ రుతురాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తోడు గా డారిల్ మిషెల్, మోయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజాలు రాణిస్తున్నారు. ఇక ఫినిషర్‌గా ధోనీ తన పాత్ర ను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. బౌలింగ్‌లో పతిరణ, ముస్తఫిజుర్ లేని లోటు స్పష్టంగా తెలుస్తున్నప్పటికి శార్దూల్, తుషార్, సిమర్ జీత్‌లు రాణిస్తున్నారు.

ఎటు చూసినా.. 18

నేటి మ్యాచ్‌కు మరో విషిష్ఠత కూడా ఉంది. బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకోవాలంటే.. ఈ మ్యాచ్‌లో చెన్నైపై కనీసం 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఒక వేళ లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే.. 18.1 ఓవర్లలో చేజ్ చేయాలి. 18వ తేదీన జరుగుతున్న ఈ పోరులో.. జెర్సీ నంబర్ 18 ధరించే ప్లేయర్ (విరాట్ కోహ్లీ)పై భారీ అంచనాలు ఉన్నాయి. 2013 తర్వాత మే 18న జరిగిన మ్యాచ్‌లో ఓడింది లేదు. ఈ తేదీన నాలుగు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు నాలుగింట్లోనూ విజయం సాధించింది. అందులో రెండు చెన్నైపై కావడం విశేషం. ఇక మే 18న విరాట్ గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. 2013 మే 18న చెన్నైతో పోరులో కోహ్లీ 29 బంతుల్లో 59 పరుగులు చేసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2014లో చెన్నైపై 27 ర న్స్, 2016లో పంజాబ్‌పై 113 పరుగులు, 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 100 పరుగులు చేశాడు. తనకు అచ్చొచ్చిన 18వ తేదీన విరాట్ మరోసారి విజృంభించి బెంగళూరును ప్లే ఆఫ్స్‌కు చేర్చాలని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.

ఫైనల్ కాని ఫైనల్..

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు చూసేవాళ్లకు సాధారణ మ్యాచ్ కావొచ్చు. కానీ ప్లేఆఫ్స్ రేసు కోణంలో చూస్తే మాత్రం ఇది ఫైనల్ కాని ఫైనల్ అనింపించక మానదు. టైటిల్ ఎవరు కొడతారన్న విషయం కంటే చెన్నై, బెంగళూరు మధ్య పోరులో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే గెలిచిన జట్టు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్తోంది. ఈ విషయంలో చెన్నైది కాస్త పైచేయిలా అనిపిస్తున్న ప్పటికీ తమదైన రోజున ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు బెంగళూరు వెనుకడుగు వేయడానికి ఇష్టపడదు. వర్షం ముప్పు లేకపోతే మాత్రం ఇరుజట్ల మధ్య భీకర పోరు చూసే అవకాశముంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌తోనే ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభం కాగా.. ఇరు జట్ల మధ్య పోరుతోనే ఆఖరి ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు కానుండటం విశేషం. తొలి పోరులో బెంగళూరు తేలిపోయినప్పటికి ..సీజన్ చివరకొచ్చేసరికి సీన్ మారింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒత్తిడిలో బాగా ఆడడంలో చెన్నై నేర్పరి. ఎన్నోసార్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితులను దాటి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన అనుభవం సూపర్ కింగ్స్ సొంతం.