పాక్‌తో సిరీస్‌కు సిద్ధం: రోహిత్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్ తటస్థ వేదికపై జరిగితే మంచిదని అభిప్రాయపడ్డాడు. పాడ్‌కాస్ట్ కు ఇంటర్యూ ఇచ్చిన రోహిత్ మాట్లాడుతూ.. ‘పాక్‌తో ఆడడం నాకు చాలా ఇష్టం. రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు హోరాహోరీగానే ఉంటుంది. రెండు దేశాల మధ్య సంబం ధాలు దెబ్బతినడంతో ఐసీసీ ట్రోఫీల్లో మాత్రమే వారితో మ్యాచ్‌లు ఆడుతున్నాం. తటస్థ వేదికల్లో భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహిస్తే మేము ఆడేందుకు సిద్ధం. పాకిస్థాన్ బౌలింగ్ బాగుంటుంది. వారి బౌలింగ్‌లో ఆడుతుంటే ఆ మజా వేరుగా ఉంటుంది.
నాకు తెలిసి 2007 చివరి సారి పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడాననుకుంటా. అదే (భారత్ సిరీస్) జరిగితే మాత్రం మీరు ఒక మంచి ఆటను చూస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు టి20 ప్రపంచకప్‌కు సంబంధించి జట్టు ఎంపికపై తాను బీసీసీఐ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ను కలిసినట్లు వస్తున్న వార్తలపై కూడా రోహిత్ స్పందించాడు. ‘ఆ వార్త నిజం కాదు. నేనేవరిని కలవలేదు. నేను ఐపీఎల్‌లో బిజీగా ఉన్నా.. అగార్కర్ దుబాయ్‌లో గోల్ఫ్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఇక కోచ్ రాహుల్ భాయ్ కుటుంబంతో గడుపుతున్నాడు. ఏదైనా కీలక సమచారం ఇవ్వాలనుకుంటే మా ముగ్గురిలో ఎవరో ఒకరం అందరికి తెలిసేలా వెల్లడిస్తాం’ అని వెల్లడించాడు.






