సొంతింటి కల సాకారం
560 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ రెండేళ్ల నిరీక్షణకు తెర
కోదాడ, ఆగస్ట్ 9 :కోదాడ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఆదివారం పట్టణంలోని పెరక భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఇళ్ల పట్టాలను స్వయంగా అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.రెండేళ్లుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు పట్టాలు అందడంతో వారి నిరీక్షణకు తెరపడింది. ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించే ముందు మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించామని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తెలిపారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాతే ఇళ్ల పంపిణీ చేపట్టామని పేర్కొన్నారు.పట్టాలు అందుకున్న లబ్ధిదారులు ఇక ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే గృహప్రవేశాలు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సొంతింటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు ఇళ్లు దక్కడంతో కార్యక్రమంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పట్టాలు చేతికందడంతో లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సొంతింటి కల నెరవేరడం తమ జీవితంలో మరచిపోలేని రోజని పలువురు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.






