10 August, 2026 | 3:47 AM

సాగర్ ఎడమ కాలువకు తక్షణమే నీరు విడుదల చేయాలి

10-08-2026 12:19 AM

వ్య.కా.సం జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు

నేరేడుచర్ల,ఆగస్టు 9(విజయ క్రాంతి):--కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎగువనుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని సాగర్ ఎడమ కాలువకు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేరేడుచర్ల పట్టణంలో ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల ఆల్మట్టి,

జూరాల, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయని శ్రీశైలం కూడా మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నిండే అవకాశం కన్పిస్తున్నందున తక్షణమే సాగర్ ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేయాలని, సాగర్ ఎడమ కాలవకు ఒక పంట పూర్తిస్థాయిలో రైతు చేతికి అందేందుకు కేవలం 40 టీంసిల నీరు సరిపోతుందని శ్రీశైలంలో ఇప్పటికీ రెండు వందల టీఎంసీల నీరు ఉన్నదని, ఎడమ కాలువకు నీరు విడుదల చేయని యెడల అట్టి నీరు ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోయే ప్రమాదం ఉన్నదని,ఒక పంటకు నీరు విడుదల చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి మనుషులకు పశువులకు పక్షులకు కూడా తాగునీరు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే తక్షణమే సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదలచేయాలన్నారు.

ఈ సమావేశంలో గీత పనివారల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా. కోటయ్య, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను,ఏఐటియుసి ప్రాంతీయ సహాయ కార్యదర్శి ముత్యాల భాస్కర్, సిపిఐ సీనియర్ నాయకుడు బెల్లంకొండ గోవిందు గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.