కాంగ్రెస్@100!
హస్తానికి మద్దతు తెలిపిన మహారాష్ట్రలోని రెబెల్ ఎంపీ
ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఖర్గే ట్వీట్
ముంబై, జూన్ 7: కాంగ్రెస్ ఎంపీల సంఖ్య 100కు చేరువ కానుంది. మహారాష్ట్ర సాంగ్లీ నుంచి కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచిన విశాల్ పాటిల్, తన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి మద్దతు ప్రకటిస్తున్నట్లు లేఖను అందజేశారు. ఈ విషయాన్ని ఖర్గే ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ పాటిల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
విశాల్ గురువారమే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి మద్దతును తెలియజేస్తూ లేఖలు రాశారు. విశాల్ పాటిల్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్ మనవడు. ఇండియా కూటమి ఒప్పందంలో భాగంగా సాంగ్లీ సీటును శివసనే (యూబీటీ)కి కేటాయించారు. దీంతో విశాల్ రెబెల్‌గా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సంజయ్ కాకాపై విజయం సాధించారు.
ఈ విషయంలో లోక్‌సభ కార్యదర్శి అనుమతిస్తే విశాల్ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతారు. దీంతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 99 నుంచి 100కు చేరుతుంది. కాగా, బీహార్‌లో పూర్ణియా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పప్పు యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన పప్పు యాదవ్.. ఆర్జేడీతో ఒప్పందం కుదరకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.






