భూగర్భ జలాలకు రిచార్జ్
గ్రేటర్‌లో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్
ఐదు పార్కులను ఎంపిక చేసిన అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (విజయక్రాంతి): భూగర్భ జలాల పరిరక్షణ లో భాగంగా ఎండిపోతున్న బోర్లకు జీవం పోసేందుకు జీహెచ్‌ఎంసీ షాలో ఆక్విఫర్ ప్రాజెక్టును అమలు చేస్తున్నది. అమృత్ పథకంలో భాగంగా గ్రేటర్‌లో 5 పార్కులలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు గా చేపట్టనున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు సహాయంతో అమలు చేస్తుండగా, జీహెచ్‌ఎంసీ అధికారు లు, ఎన్‌ఐయుఏ ప్రతినిధులు, రెయిన్ వాట ర్ ప్రాజెక్టు బృందం సభ్యులు హబ్సీగూడ లోని కాకతీయనగర్ పార్కులో స్థానిక కాల నీవాసులకు మంగళవారం అవగాహన కల్పించారు.
చుట్టుపక్కల వాటర్ షెడ్ నుం చి నీటిని సేకరించడం, రీచార్జ్ ఫిట్‌ల ద్వారా నీటిని పంపడం వల్ల భూగర్బంలోని పొరల ను ఇది రీఛార్జ్ చేస్తూ నీటి లెవల్స్‌ను పెంచ నున్నారు. ఈ ప్రాజెక్టును ఖైరతాబాద్ జోన్ లో కేఎల్‌ఎన్ యాదవ్ పార్కు, శేరిలింగం పల్లి జోన్‌లో టెక్నో పార్క్, సికింద్రాబాద్ జోన్‌లో ఇందిరా పార్క్, ఎల్‌బీ నగర్ జోన్‌లో హబ్సీగూడ కాకతీయనగర్ కాలనీ పార్క్, సైనిక పురిలోని ఈకూ పార్క్‌లలో అమలు చేసేందుకు ఎంపిక చేశారు. ఈ పార్కు ల్లో 100 నుంచి 120 అడుగుల లోతు వరకూ షాలో ఆక్విఫర్ ఇంజక్షన్ బోర్ వెల్ ను డ్రిల్ చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
దీనివల్ల లోతులేని జలాశయాలలో వర్షపాతం ఉన్నప్పుడల్లా భూమిలోని దిగువ పొరలు రీఛార్జ్ అవుతాయని యుబిడి అడిషనల్ కమిషనర్ సునందరాణి వివరించారు. కార్యక్రమంలో యుబిడి డిప్యూటీ డైరెక్టర్ ఎం. చంద్రశేఖర్ రావు, ఎన్‌ఐయుఏ ప్రతినిధి అనిరుద్, ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ బృందం అధిపతి కల్పన, ఉప్పల్ సర్కిల్ మేనేజర్ ఎ. నరసింహరావు, ఇతర జీహెచ్‌ఎంసీ అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.






