24 August, 2026 | 3:02 AM

బహవల్పూర్ ఉగ్ర కేంద్రం పునర్నిర్మాణం

24-08-2026 12:00 AM
  1. 25 కోట్లు ఇచ్చిన పాకిస్థాన్ ప్రభుత్వం
  2. భారత ఇంటెలిజెన్స్ ధ్రువీకరణ

ఇస్లామాబాద్, ఆగస్టు 23: ఆపరేషన్ సింధూర్‌లో భారత్ దాడిలో ధ్వంసమైన పాక్‌లోని బహవల్పూర్ స్థావరాన్ని జైష్ ఏ మహమ్మద్ మర్కజ్ సుభాన్ అల్లా ప్రధాన కార్యాలయం పునర్నించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించగా, తాజాగా ఉపగ్రహ చిత్రాల్లో కూడా నిర్మాణాలు కనిపిస్తున్నాయి. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ ఉగ్రవాద కార్యాలయం శిబిరానికి సంబంధించిన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. అప్పట్లో దాడి జరగలేదని పాక్ ప్రభుత్వం బుకాయించింది. ఈ కేంద్రం పునరుద్ధరణకు పాక్ ప్రభుత్వం జేష్ ఏ మహమ్మద్‌కు 25 కోట్ల రూపాయలిచ్చినట్లు తెలుస్తుంది.

దీంతో మదర్సాలు, ఉగ్ర నాయకులకు గృహాలు, సహా ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా చేపట్టినట్లు తెలుస్తుంది. 2025 మే 7న భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట చేపట్టిన దాడుల్లో ఈ కేంద్రం ధ్వంసమైంది. ఈ దాడిలో జైష్ ఎ మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ బంధువులు 13 మంది మృతి చెందారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఈ ఉగ్రవాద కేంద్రం వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉగ్రవాదుల కార్యకలాపాలు, శిక్షణ, నియామకాలు, మదర్సా బోధనలు ఇక్కడ కొనసాగుతుంటాయి. 2001 పార్లమెంట్‌పై దాడి, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడితోపాటు, పహెల్గామ్ దాడికి కూడా ఇక్కడి నుంచే ప్రణాళిక రచించినట్లు భారత్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.