హిందూ కుటుంబం దారుణ హత్య
- రిటైర్డ్ ఉపాధ్యాయుడు, భార్య, కుమార్తె, కొడుకు మృతి
- బంగ్లాదేశ్‌లో ఘటన
ఢాకా, ఆగస్టు 23: బంగ్లాదేశ్ రంగపూర్‌లో హిందూ కుటుంబం హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను రంగపూర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. హత్య చేశాక నిందితులు ఇంట్లోనే భోజనం చేసి, స్నానం చేసి ఏడు గంటలపాటు అక్కడే ఉండి పారిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. గణపతి చక్రవర్తి (౬౫) ఇంటిపై కప్పుపైన నిందితులు మాదకద్రవ్యాన్ని సేవిస్తుండగా ఆయన చూశారు.
దీంతో భయపడ్డ ఇద్దరు చక్రవర్తి మెడకు టవల్ చుట్టి గొంతు నులిమి చంపేశారు. పెనుగులాట శబ్దం విన్న గణపతి భార్య ప్రీతిలత(౫౦) మెట్లపైకి వెళ్లగా ఆమెను కూడా గొంతు నులిమి హత్య చేశారు. ఆ తరువాత కుమార్తె ఆగమి (౨౩), కుమారుడు ప్రియం (౧౨)ను కూడా హత్య చేశారు. నిందితుల్లో ఒకరు ప్రియం స్నేహితుడని పోలీసులు తెలిపారు. ముగ్ధో, సిద్ధార్థ అనే నిందితులు హత్య చేసినట్లుగా అంగీకరించారని రంగపూర్ మెట్రోపాలిటన్ పోలీసులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ పోలీసులు ప్రకటించారు.






