15-12-2025 12:00:57 PM
పతనంతిట్ట: శబరిమల(Sabarimala) అయ్యప్పస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో(Sabarimala Ayyappan Temple) జరుగుతున్న వార్షిక మండల తీర్థయాత్ర సీజన్‌లో యాత్రికుల సంఖ్య 25 లక్షలు దాటిందని ఒక సీనియర్ అధికారి సోమవారం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, సమర్థవంతమైన ప్రణాళిక ఏర్పాట్ల కారణంగా కొండపై ఉన్న ఆలయంలో దర్శనం సజావుగా కొనసాగుతోందని శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్, ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ తెలిపారు. గతేడాది ఇదే సమయానికి సుమారు 21 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించగా, ఈ ఏడాది ప్రస్తుత సీజన్‌లో ఆ సంఖ్య 25 లక్షలు దాటిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రారంభ రోజుల్లో భారీగా రద్దీ ఏర్పడినప్పటికీ సకాలంలో చర్యలు తీసుకోవడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు. తమ వర్చువల్ క్యూ పాస్‌లలో పేర్కొన్న తేదీన యాత్రికులు రాకపోవడం వల్లే ఈ తాత్కాలిక రద్దీ ఎక్కువగా ఏర్పడిందని సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. భక్తులు కేటాయించిన తేదీలకు కట్టుబడి ఉంటే, ప్రతి ఒక్కరికీ దర్శనం కోసం తగినంత సమయం కల్పించవచ్చన్నారు. ఈ సీజన్‌లో వారాంతాల్లో భక్తుల రద్దీ సాపేక్షంగా తక్కువగా ఉంటుందని, డిసెంబర్ నెలాఖరుకు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీజిత్ తెలిపారు. దాదాపు రెండు నెలల పాటు జరిగే వార్షిక తీర్థయాత్ర కాలంలోని మొదటి దశ ముగింపును సూచించే పవిత్రమైన మండల పూజ డిసెంబర్ 27న శబరిమలలో జరగనుంది.