20-01-2026 01:51:23 AM
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రికార్డు స్థాయి ధర
ఒక్కరోజులోనే రూ.8 వేలపెరుగుదల
అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక అనిశ్చితులే కారణం
న్యూఢిల్లీ, జనవరి 19: దేశవ్యాప్తంగా వెండి ధరలు అమాంతం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఆదివారం కిలో వెండి ధర రూ.3,10,000 పలుకగా, సోమవారానికి ఆ ధర రూ.3,18,000కు చేరుకుని సరికొత్త రికార్డులు సృష్టించింది. సామాన్యుడికి అందుబాటులోకి లేకుండా వెండి ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన వారు వెండి కొనుగోలు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. కేవలం వెండికే కాకుండా అదనంగా జీఎస్టీ, తయారీ చార్జీలు చెల్లించాల్సి రావడం వారి స్తోమతకు మించినదిగా పరిణమించింది. అలాగే పసిడి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.1,46,240 పలుకుతున్నది. అలాగే 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.1,34,050 ట్రేడింగ్‌లో ఉంది. అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు, భౌగోళిక అనిశ్చితి కారణంగానే దేశీయంగా బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, యూరోపియన్ దేశాలతో వాణిజ్య యుద్ధం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. మున్ముందు కిలో వెండి ధర రూ.4 లక్షల వరకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్లు పతనం కారణంగా మదుపర్లు బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.