2.31కోట్ల రెక్టిఫైడ్ స్పిరిట్ స్వాధీనం
మేడ్చల్, మే 9 (విజయక్రాంతి) : నిబందనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కెమికల్ గోదాంపై మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు దాడు లు నిర్వహించి కోట్ల రూపాయల విలువ చేసే స్పిరిట్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు కిషన్, జీవన్ కిరణ్‌లు దూలపల్లి వెళ్తుండగా భారీ వాహనంలో స్పిరిట్‌ను తరలిస్తుండగా చూసి, అనుమానంతో వెంబడించగా దూలపల్లిలో సర్వే నంబర్ 135, ప్లాట్ నంబర్ 125లోని జగదాంబ కెమికల్స్ గోదాంలోకి వాహనం వెళ్లింది. వెళ్లి పరిశీలించగా ఎలాంటి అనుమతుల్లేకుండా రెక్టిఫైడ్ స్పిరిట్‌ను నిల్వ చేసి అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. గోదాంలోని డ్రమ్ములను లెక్కించగా 105 డ్రమ్ముల్లో 21వేల లీటర్ల స్పిరిట్ ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో డ్రమ్ములో 200 లీటర్ల స్పిరిట్‌ను నిలువ చేశారు. స్పిరిట్ విలువ రూ. 2.31కోట్లు ఉంటుందని నిర్ధారించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి సంబంధిత గోదాంను సందర్శించారు. స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకులు హనుమాన్ సేన్, శ్రవణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.






