గ్రేటర్‌లో పనులు చేయం!
18 నుంచి సమ్మెకు దిగనున్న కాంట్రాక్టర్లు
ఏడాదిగా రూ. 1300 కోట్లు పెండింగ్
తక్షణమే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి
బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయా అంటే అవుననే తెలుస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా బల్దియా నిర్వహించే మెయింట్‌నెన్స్, సీసీ రోడ్డు, మాన్‌సూన్‌లో ఎమర్జెన్సీ వర్క్స్, ఐఆర్‌టి, డీసీల్టింగ్, డ్రైన్స్, నాలాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు వంటి పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు ఏడాది కాలంగా బిల్లు లు పెండింగ్‌లో ఉన్నాయి. టెండరు ఖరారు అనంతరం పనులు నిర్వహణలో కాంట్రాక్టర్లు ముందస్తుగా మెటీరియల్, ఇతరత్ర వ్యయం చేస్తుంటారు. కానీ, మొత్తం పనులు పూర్తయ్యి బిల్లులు మంజూరుకు అధికారులకు ఫైల్ చేసి ఏడాది దాటినా నిధులు విడుదల కాకపోవడంతో తీవ్ర అసహనంలో ఉన్నారు. నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కమిషనర్, పలువురు మంత్రులతో పాటు ముఖ్యమంత్రికి కూడా వినతిపత్రం అందజేశారు. అయి నా నిధులు విడుదల కాకపో వడంతో నగర వ్యాప్తంగా టెండర్ పొందిన పనులు నిలిపివేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 18వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్టు కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్ అసోసి యేషన్లు హెచ్చరిస్తున్నాయి.
ఏడాదిగా రూ. 1300కోట్ల పెండింగ్
జీహెచ్‌ఎంసీలో 2023 మే నుంచి కాం ట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు దాదాపు రూ. 1307కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు ఏడాది కాలం పెండింగ్‌లో ఉన్నందున కాంట్రాక్టర్లు చెల్లించుకోవాల్సిన లోన్ ఈఎంఐలు, లేబర్ పేమెంట్‌లు, ఇతర చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రాలు అందజేశారు. 2023 మే నుంచి డిసెంబరు వరకు మొత్తం రూ. 809 కోట్లు, 2024 జనవరి నుంచి మార్చి దాకా రూ. 498కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. చేసిన పనులకు నిధులు మంజూరు కానందున నగర శివారు ప్రాంతాలకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డట్టుగా అసోసియేషన్ నాయకు లు తెలిపారు. అయితే, ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా రూ. 1100 కోట్ల నిధులు విడుదల చేస్తే ఈ బిల్లులు క్లియరెన్స్ అయ్యేం దుకు అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధి కారులు అంటున్నారు.
థ్రెడ్ లోన్‌లో వడ్డీ భారం మాపైనే
2023లో ఏప్రిల్ వరకూ పెండింగ్ బిల్లులకు థ్రెడ్ విధానంలో బ్యాంకు లోన్ ఇచ్చారు. ఈ విధానంలో జీహెచ్‌ఎంసీ బిల్లు చెల్లించే నాటికి ఎంత వడ్డీ అవుతుందో.. అంత వడ్డీని మా నుంచి ముందుగానే బ్యాంకు లోన్ రూపంలో చెల్లించారు. కానీ, ఇవి కూడా పూర్తిస్థాయిలో రాలేదు. అది కూడా బిల్లులు ఫైల్ చేసి 6నెలల గడిచిన వాళ్లకు మాత్రమే ఇస్తారు. జీహెచ్‌ఎంసీలో బిల్లులు లేటుగా ఇస్తున్నందున మూడేళ్ల క్రితం 5వేలకు పైగా ఉన్న కాంట్రాక్టర్లు ప్రస్తుతం 2వేల మంది మాత్రమే ఉన్నారు. క్రమేపీ కాంట్రాక్టర్లు ఏ పనులు చేయడానికి ముందుకు రావడంలేదు. కాంట్రాక్టర్లు అప్పులు పాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం తక్షణమే బిల్లులకు నిధులు మంజూరు చేయాలి.
- సాయి కిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, బీసీ కాంట్రాక్టర్ అసోసియేషన్
అప్పల భారం తట్టుకోలేక ఆత్మహత్యలు
మేమంతా కోటి రూపాయల నుంచి రెండు కోట్ల వరకూ పనులు చేసే కాంట్రాక్టర్లం. అప్పులు చేసి ఈఎంఐలు, లేబర్ పేమెంట్ చేయాల్సి వస్తోంది. ఒక నెల, రెండు నెలలు అంటే సర్ధుబాటు చేసుకోవచ్చు. సంవత్సరం పాటు అప్పులు చేయాలంటే ఎలా సాధ్యం అవుతోంది. దీంతో అప్పుల భారం తట్టుకోలేక ఇటీవల శివారు ప్రాంతం గాజుల రామారంలో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్లులను రూ. 20లక్షల లోపు, రూ. 20లక్షల పైగా అని విడగొట్టినా చెల్లింపులు జరగడం లేదు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు మరింత భారంగా మారుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పెండింగ్ బిల్లులు చెల్లించాలి.
- భాస్కర్‌రావు, బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి






