గర్భిణీ స్త్రీల నమోదు పూర్తిస్థాయిలో చేయాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): గర్భిణీ స్త్రీల నమోదు పూర్తిస్థాయిలో చేయాలని వైద్యశాఖ సిబ్బందికి కలెక్టర్ ఆశిష్ సంగువాన్ సూచించారు. బుధవారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా దేవునిపల్లి పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, శాబ్ధిపూర్‌లో పల్లె దావకాన లలో ,గ్రామ ఆరోగ్య, పోషణ, పారిశుధ్య దినోత్సవం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలపై పల్లె దవాఖాన వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సమస్యను దృష్టిలో ఉంచుకొని, కలెక్టర్ సమక్షంలో ఒక గర్భిణీ స్త్రీకి హెమోగ్లోబిన్ పరీక్ష నిర్వహించారు. అలాగే షుగర్ పరీక్షలకు సంబంధించిన కిట్లను పరిశీలించారు. గ్రామ జనాభా ప్రాతిపదికన గర్భిణీ స్త్రీల నమోదు పూర్తి స్థాయిలో చేయాలని, పిల్లలకు సమయానుకూలంగా టీకాలు అందించాలని సూచించారు.
పోషణ, సీజనల్ వ్యాధులు, క్షయ (TB), లెప్రసీ వంటి వ్యాధులపై గ్రామ సర్పంచ్, హెల్త్ కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. డి. రవీందర్ గౌడ్ , ప్రోగ్రాం ఆఫీసర్, డా. రాజు, మెడికల్ ఆఫీసర్ డీపీఓ పద్మజ , స్థానిక సర్పంచ్ , మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.




