6 March, 2026 | 12:36 PM

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు

06-03-2026 01:30 AM

కొండపైన జర్మనీ టెక్నాలజీతో షెడ్లు నిర్మాణం

యాదగిరిగుట్ట, మార్చి 5 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో గురువారం నిత్య పూజా కైంకర్యాలు   శాస్త్రోక్తంగా  నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వయంభులను మేల్కొల్పిన అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్టమూర్తులను  వేదమంతోత్సవములు,  మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలలను అర్పించారు. ప్రాకారమంటపంలో సుదర్శన నరసింహహోమం, నిత్య కళ్యాణం పండితులు ఘనంగా నిర్వహించారు.

భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని మొక్కల ను చెల్లించుకున్నారు. సాయంత్రం స్వామివారి వెండి జోడు సేవలో స్వామివారిని అలంకరించి తిరువీధులలో ఊరేగించారు. కొండపైన అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర  శివాలయంలో నిత్య కైంకర్యాలను పండితులు నిర్వహించారు. పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య పూజలను పండితులు నిర్వహించారు                             

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కొండపైన వసతులు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం కొండపైన  రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని దేవస్థాన అధికారులు భక్తులకు సౌకర్యాలను కల్పిస్తున్నారు. వచ్చే మూడు నెలలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున, వసతులను దృష్టిలో పెట్టుకొని జర్మనీ సాంకేతికతతో ఏర్పాటు చేసిన షెడ్లను నిర్మాణం చేశారు. కొండపైన రాతి కట్టడాలు కావడంతో వేడి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జర్మన్ టెక్నాలజీతో రూపొందించిన ప్రత్యేకమైన షీట్లను ఉపయోగిస్తున్నారు. ఈ షీట్లు యువి కిరణాలను పరావర్తనం చెందిస్తాయి.

దాని ప్రభావం వలన బయట ఎంత ఎండ ఉన్నా ఈ షెడ్ల కింద ఉండే ఉష్ణోగ్రత కనీసం ఐదు నుండి ఎనిమిది డిగ్రీల తక్కువగా ఉండి భక్తులకు చల్లదనం ఇస్తుంది. అంతేకాక భక్తులు నడిచే దారిలో కోల్ రూమ్ పెయింట్ కూడా వేయించారు.ఈ తెల్లటి రంగు పెయింట్ సూర్య కిరణాలను గ్రహించకుండా వెనక్కి పంపుతుంది. మండుటెండలో కూడా నేల వేడెక్కకుండా భక్తులు నడిచే దారిలో వేడి తలగకుండా చల్లదనంగా ఉంటుందని అధికారులు తెలిపారు.