19 August, 2026 | 3:55 AM

సర్ ముసాయిదా విడుదల

19-08-2026 12:00 AM

తగ్గిన ఓటర్ల సంఖ్య 

తరలిన ఓట్లు కరీంనగర్ జిల్లాలో అధికం...

తుది జాబితా అక్టోబర్ 19న       

కరీంనగర్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఉమ్మడి కరీంనగర్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. నాలుగు జిల్లాలకు సంబంధించి జూన్ 10న మొత్తం 29,97,973 మంది ఓటర్లలో 26,06,427 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ అయ్యాయి. 3,91,546 మంది ఓటర్ల వివరాలను గైర్హాజరు, ఇల్లు మారడం, మరణించడం, డూప్లికేట్ (ఏఎస్‌ఈడీ) కేటగిరీలోకి చేర్చారు. ఈ మేరకు సర్ ప్రక్రియ ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది.

గైర్హాజరు, ఇల్లు మారడం, మరణించడం, డూప్లికేట్ సంబంధిత కేటగిరీల ఆధారంగా గుర్తించిన ఎంట్రీలు. తుది ఓటర్ల జాబితా సిద్ధమయ్యే ప్రక్రియలో ప్రతి ఎంట్రీకి సంబంధించి ధ్రువీకరణ, అభ్యంతరాలు, క్లెయిమ్లు, సంబంధిత పత్రాల పరిశీలన వంటి దశలు ఉంటాయి.

మ్యాపింగ్ చేసుకోనివారు, 2002 ఓటరు జాబితాకు, ప్రస్తుతం ఉన్న జాబితాలో పేర్లు తప్పుగా ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. వారంతా సంబంధిత ధ్రువపత్రం చూపి ఏఈఆర్వో/ ఈఆర్వో వద్ద ఓటర్ల జాబితాపై మార్పులు, చేర్పులు లేదా అభ్యంతరాలుంటే ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16, 2026 వరకు తెలియజేయవచ్చు. ప్రతి ఒక్కరూ తమ పేరు, చిరునామా పోలింగ్ కేంద్రాల నోటీసు బోర్డులలో లేదా అధికారిక సీఈఓ తెలంగాణ పోర్టల్ ద్వారా సరిచూసుకోవాలి. పేరు లేకపోతే ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

- తగ్గిన ఓటర్లు...

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎస్‌ఐఆర్ తర్వాత ఓటర్లు తగ్గారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎక్కువమందివి ఓట్లు వేరే రాష్ట్రాలకు తరలాయి. ఎస్‌ఐఆర్ కు ముందు జగిత్యాల జిల్లాలో 7,21,032 ఓట్లు ఉండగా 6,46,294 ఓట్లు డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. 74,738 ఓట్లు పూర్తికాలేదు.

పెద్దపల్లి జిల్లాలో 7,12,157 ఓట్లు ఉండగా 6,46,294 ఓట్లు డిజిటలైజేషన్ పూర్తికాగా, 81,139 ఓట్లు పూర్తికాలేదు. కరీంనగర్ జిల్లాలో ఎస్‌ఐఆర్ కు ముందు 10,89,090 ఓట్లు ఉండగా, 9,11,988 ఓట్లు డిజిటలైజేషన్ కాగా, 1,77,102 ఓట్లు పూర్తికాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,75,694 ఓట్లు ఎస్‌ఐఆర్ కు ముందు ఉండగా 4,17,127 ఓట్ల డిజిటలైజేషన్ పూర్తయింది. 58,567 ఓట్లు డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. ఆ మేరకు ముసాయిదా జాబితా విడుదల చేశారు. 

- అక్టోబర్ 19న తుది జాబితా 

ముసాయిదా జాబితా విడుదల చేసిన అధికారులు అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం, అభ్యంతరాల పరిశీలన చేసి అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు.