14-11-2025 03:50:07 PM
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి పోలీసులు(Kalwakurthy police station) దొంగతనం కేసులో విచారణ నిమిత్తం కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన ఒక అంతర్రాష్ట్ర రిమాండ్ ఖైదీ పరారైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగిరెడ్డి అనే వ్యక్తిని ఒక కేసు విచారణలో భాగంగా కల్వకుర్తి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లాల్సి ఉందని చెప్పి బాత్రూంలోకి వెళ్లిన నాగిరెడ్డి, కిటికీ మార్గంగా పోలీసులను మోసగించి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు సమీప ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఖైదీ కోసం ముమ్మరంగా శోధిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వికలాంగుడిగా ఉన్న రిమాండ్ ఖైదీ బాత్రూం కిటికీ డోర్ నుంచి ఎలా పరార్ అయ్యాడన్న అంశంలో సర్వత్ర చర్చ నడుస్తోంది.