27 July, 2026 | 2:03 AM

కాకతీయ తోరణాన్ని తొలగిస్తే మరో ఉద్యమమే

31-05-2024 12:00 AM

మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ 

హనుమకొండ, మే 30 (విజయక్రాంతి): తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తే మరో ఉద్యమం తప్పదని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో గురువారం ‘తరతరాల మన సంపద తోరణం, చార్మినార్ కోసం రణం’ అనే అంశంపై మేధావులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రను రూపుమాపాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఇది కాంగ్రెస్ నిర్ణయంగా భావించడం లేదని, ఉద్యమంలో పాలు పంచుకోని వ్యక్తి చరిత్రపై అవగాహనలేని వ్యక్తి చేస్తున్న దుశ్చర్యగా భావిస్తున్నామని మండిపడ్డారు. చరిత్ర గుర్తులను తొలగిస్తుంటే జిల్లాకు చెందిన మంత్రులు వ్యతిరేకించకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాకతీయ రాజులు అనేక కార్యక్రమాలు చేశారని, ప్రజావ్యతిరేక పనులు చేయలేదని స్పష్టంచేశారు. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పుడు తామంతా వ్యతిరేకించామని, రేవంత్‌రెడ్డి చరిత్రకారులతో చర్చిస్తామని, సబ్ కమిటీ వేస్తామన్న విషయాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్య చర్యలను వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు కాళోజీ సెంటర్‌లో నిరసన కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. 

నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ నిరసన

లోగో మార్పు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీఆర్‌ఎస్ వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ రజినీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.