నకిలీలతో తస్మాత్ జాగ్రత్త
వరంగల్, మే 30(విజయక్రాంతి): రెక్కల కష్టాన్ని నమ్ముకొనే కర్షకులు కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. అన్నదాతలు ఎంత కష్టపడినా సరైన విత్తనం ఎంపిక లేకపోతే కష్టం వృథాగా పోతుంది. మార్కెట్‌లో నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా చెలామణి అవుతున్న తరుణంలో రైతన్నలు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.
మార్కెట్‌లో లభ్యమయ్యే విత్తనాల విషయంలో ఏది మంచిదో.. ఏది నకిలీదో అర్థం కాని పరిస్థితుల్లో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. రంగు రంగుల కవర్ల ప్యాకింగ్‌తో వస్తున్న పత్తి, మిరప, వరి, మొక్కజొన్న విత్తనాలలో ఏది కొనుగోలు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే రైతుల ఆసక్తిని, అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు కొందరు తమకు ఎక్కువ లాభాలు వచ్చే విత్తనాలను అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విత్తనాల ఎంపిక, నకిలీలను గుర్తించడంలో రైతులకు అవగాహన ఉండాలని సూచిస్తున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది.
నకిలీ విత్తనం అంటే..
విత్తన ధ్రువీకరణ సంస్థ నుంచి అనుమతి లేని గింజలను నకిలీ విత్తనాలుగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఎలాంటి అడ్రస్ లేకుండా అక్రమంగా అమ్ముతున్న విత్తనాలను కూడా నకిలీగానే భావించాలి. వాణిజ్య పరీక్షల నుంచి చోరీకి గురైన విత్తనాలు, నకిలీ ప్యాకింగ్ చేసి అమ్ముతున్న విత్తనాలు, లైసెన్స్ లేకుండా అమ్ముతున్న డీలర్ల వద్ద లభించే విత్తానాలను కూడా నకిలీగానే గుర్తించాలి.
రెండు రకాలుగా గుర్తించవచ్చు..
నకిలీ విత్తనాలను రెండు రకాలుగా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందు లో ఒకటి పంట వేయక ముందు, రెండోది పంట వేసిన తర్వాత. అయితే పంట వేయక ముందు నకిలీదని గుర్తిస్తే రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చు. పంట వేసిన తర్వా త విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడం, మొలకెత్తినా మొక్కలు ఏపుగా పెరగకపోవడం, పూర్తిస్థాయిలో పూత రాకపోవడం, వచ్చిన పూత రాలిపోవడం, కాయలుగా మారకపోవడం వంటి లక్షణాలు పంట సమయంలో గుర్తించవచ్చు. విత్తనాలు నాటిన తర్వాత నకిలీవని గుర్తించినా లాభం ఉండదు కాబట్టి రైతులు ధ్రువీకరించుకున్న తర్వాతనే నాటుకోవాలి.






