చార్మినార్‌ను దురాక్రమణదారులు నిర్మించారు
కాకతీయ కళాతోరణం చారిత్రక వైభవానికి చిహ్నం
రాష్ట్ర చిహ్నంలో మార్పులపై ఏకపక్ష నిర్ణయం తగదు
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): చార్మినార్ దురాక్రమణదా రులు కట్టిన కట్టడమని, కాకతీయ కళాతోరణం కాకతీయ సామ్రాజ్య వైభవం ప్రతిబింబించే చిహ్నమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల విషయంలో సర్కారు అనాలోచితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ఏదో మార్క్ చూపించుకోవాలనే ఆత్రుతతో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. లోగో నుంచి చారిత్రక చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగిస్తారనే ప్రచారంతో ప్రజలను సర్కారు రెచ్చగొడుతోం దన్నారు.
కాకతీయ కళాతోరణాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ వైఖరి సరికాదని హెచ్చరించారు. చిహ్నాన్ని మార్చాలనుకుంటే ఓ కమిటీ వేసి రాష్ట్రంలోని మేధావులు, కవులు, ఉద్యమకారుల సలహాలు తీసుకుని, నిర్ణయం తీసుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో తీసుకుం టూ.. లీకులిచ్చి ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. చిహ్నంలో చేసిన మార్పులను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి నేడు ఉద్యమ త్యాగాలను మర్చిపోయారని విమర్శించారు. ఆర్నెల్లలోనే రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని చెప్పారు.






