10-09-2025 10:54:48 AM
ఉదృతంగా ప్రవహిస్తున్న రెంకోని వాగు
మైనారిటీ పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తప్పని తిప్పలు
వాగుపై వంతెన లేక నానా అవస్థలు
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality) తలాపునే ప్రవహిస్తున్న రేంకోని వాగు ఉప్పొంగి పారుతున్న నేపథ్యంలో రాకపోకలు కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పట్టణాన్ని అనుకునే ప్రవహిస్తున్న ఈ వాగులో పై ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రవాహ ఉధృతి తీవ్ర రూపం తాలుస్తుంది. కాగా ఈ వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన ఇటీవల వర్షాలకు పైపులన్నీ కొట్టుకుపోయి వాగు అవతలి వైపు ఉన్న హైటెక్ సిటీ కాలనీకి, ఆ కాలనీలో ఉన్న మైనారిటీ పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
ప్రతిరోజు ఉపాధ్యాయులు విధులు నిర్వహించడానికి మైనారిటీ పాఠశాల, కళాశాల, సిబ్బంది నడుములోతు వాగులో నడుచుకుంటూ వాగు దాటాల్సి వస్తుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాకపోకలు సాగించాల్సి వస్తుందని, ఉపాధ్యాయులు వారి వేదన విజయ క్రాంతి ప్రతినిధితో వెలిబుచ్చారు. కాగా ఈ వాగుపై శాశ్వత వంతెన నిర్మించాలని ఇక్కడ స్థానికుల విజ్ఞప్తి. కాగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ మంగళవారం మైనారిటీ శాఖ మంత్రిని కలిసి ఈ సమస్యలు విన్నవించినట్లు తెలుస్తోంది. దీంతో కాలనీ వాసుల ,పాఠశాల ఉపాధ్యాయుల కు ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వాగు పై వంతెన నిర్మిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.