02-07-2025 01:01:35 AM
- హిప్నటిజం, మేజిక్‌లోనూ దిట్ట
- మోటివేషనల్ స్పీకర్‌గా రాణింపు
- ‘జీనియస్ మీరు కూడా, విజయం మీదే’ రచనలకు ఆదరణ
- నేడు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): తెలుగు ప్రజలకు సుపరిచితు లైన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నటిస్ట్, రచయిత డాక్టర్ బీవీ పట్టాభిరామ్ (60) కన్నుమూశారు. జూన్ 30న రాత్రి 9 గంటల 45 నిమిషాలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అభిమానుల సందర్శనార్థం డాక్టర్ బీవీ పట్టాభిరామ్ భౌతికకా యాన్ని ఖైరతాబాద్‌లోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. బుధవారం మధ్యా హ్నం 3 గంట ల సమయంలో మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నా యి.
ఆయన మరణం వ్యక్తిత్వ వికాస రంగానికి తీరని లోటు అని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా పట్టాభిరామ్ కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణుడే కాదు.. హిప్నటిజం, మేజిక్‌లోనూ దిట్ట. మోటివేషనల్ స్పీకర్‌గానూ రాణించారు. తన ప్రసంగాలతో పాటు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొం దించుకునేందుకు చేయాల్సిన అంశాలపై ఆయన పుస్తకాలు కూడా రాశారు. ‘కష్టపడి చదవొద్దు.. ఇష్టపడి చదవండి’, ‘జీనియస్ మీరు కూడా’, ‘విజయం మీదే’ వంటి రచనలు పాఠకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.
దాదాపు 20 సంవత్సరాలకు పైగా మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా గౌరవప్రదంగా కొనసాగిన పట్టాభి రామ్, తన ప్రసంగాలతో, పుస్తకాలతో వేలాది మందిని, ముఖ్యంగా విద్యార్థులను మానసిక ఒత్తిడి నుంచి బయటపడేశారు. ఆయన సేవలకు గానూ ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి. పట్టాభిరామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెడీ పట్టా పొందారు. ఫిలాసఫీ, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో స్నాతకోత్తర పట్టాలు అందు కున్నారు.
కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్, జర్నలిజంలో పీజీ డిప్లొమాలు పూర్తి చేశారు. మానసిక శాస్త్రం, ఫిలాసఫీ, గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీలలో అమెరికా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. హిప్నోసిస్‌పై ఆయన చేసిన కృషికి గానూ 1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రశాంతి కౌన్సెలింగ్ అండ్ హెఆర్‌డి సెంటర్ పేరుతో ఆయన ఎంతోమందిలో మానసిక స్థుర్యైన్ని నింపారు.
బీవీ పట్టాభిరామ్ మృతి తీరని లోటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మృతిపట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపాన్ని ప్రకటించారు. ఒత్తిడికి లోనైన ఎంతోమందిని తన వ్యక్తిత్వ వికాసంతో జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ముందుకుసాగేలా ఆయన కృషి చేశారన్నారు. వ్యక్తిత్వ వికాసంపై తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, తమిళ భాషల్లో ఆయన రాసిన పుస్తకాలు ఎంతో ప్రాచార్యం పొందాయని పేర్కొన్నారు. విద్యార్థులను ఉన్నత వ్యక్తిత్వంతో తీర్చిదిద్దేందుకు తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా వ్యక్తిత్వ వికాస తరగతులు, సెమినార్లను నిర్వహించారని గుర్తుచేశారు. ఆయన మృతి విద్యావ్యవ స్థకు తీరని లోటు అన్నారు. మెజీషియన్‌గా ఆయన నిర్వహించిన కార్యక్రమాలు వినోదాన్ని పంచడంతో పాటుగా మూఢనమ్మకా లను పారద్రోలేలా చేశాయని వెల్లడించారు.