20-01-2026 07:43:29 PM
నిర్మల్,(విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాఖల వారిగా చేపట్టవలసిన పనులను అధికారులకు వివరించారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. దేశభక్తిని ప్రతిబింబించేలా విద్యార్థులచే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రముఖులను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించాలన్నారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.