20-01-2026 07:40:30 PM
సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ 9 స్థానాల్లో పోటీ చేయనుందని, ఈ ఎన్నికల్లో సిపిఐ తప్పకుండా ఘన విజయం సాధించి మునిసిపల్ లో అడుగుపెడుతుందని, ప్రజా ఉద్యమాల పార్టీ సిపిఐ అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపించాలని, కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని లేకుంటే ఒంటరి పోరుకు సిద్ధమని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగర కార్పొరేషన్ సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం న్యాలపట్ల రాజు అధ్యక్షతన మంగళవారం జరిగింది.
ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ... గత పాలకవర్గంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, బిజెపి, బీఆర్ఎస్ రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో దొంగే దొంగ అన్నట్లుగా మాట్లాడుతున్నాయని, స్మార్ట్ సిటీ పేరిట నిధులు వృధా చేశారని, డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించలేదన్నారు. ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన నిలబడానికి సిపిఐ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గణేష్ నగర్ 57, హనుమాన్ నగర్ 40, కట్టారంపూర్ 11, మారుతీనగర్ 36, బోయవాడ 46, రాంనగర్ 47, కోతి రాంపూర్ 9, కాపువాడ 58, 16 డివిజన్లలో పోటీచేస్తాం.
షెడ్యూల్ విడుదల అయ్యాక అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని ప్రజా ఉద్యమాల రథసారధి సిపిఐ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు, నగర కార్యవర్గ సభ్యులు బీర్ల పద్మ, కొట్టే అంజలి, భారతి, బాకమ్ అంజయ్య, కసిబోజుల సంతోష్ చారి, గామినేని సత్తయ్య, కూన రవికుమార్, అరవింద్, నాగునూరీ రమేష్, తదితరులు పాల్గొన్నారు.