09-12-2025 07:09:07 PM
మంచిర్యాల టౌన్ (విజయక్రాంతి): జాతీయ ఆరోగ్య మిషన్ లో పని చేస్తున్న ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్(ఏఐటీయూసీ) నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అనితకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు వినతిపత్రం అందజేసిన అనంతరం యూనియన్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనబోయిన బాపు యాదవ్ మాట్లాడారు. ఉద్యోగులకు రావాల్సిన మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని, కాంటిజెంట్ వర్కర్లకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం రూ. 15,600 చెల్లించాలని, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ. 19,500 జీవో నెంబర్ 1195 ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఏఎన్ఎం కళావతి మాట్లాడుతూ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 10 లక్షల చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలనెలా జీతాలు అందకపోవడంతో ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, కుటుంబ పోషణ కష్టమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఏఐటియుసి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిరవధిక సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఎన్సీడీ అరుణ్ శ్రీ, డీపీఓ శాంతి, ఎం ఎల్ హెచ్ పీ తేజ, స్టాఫ్ నర్స్ రజిత, ఏఎన్ఎంలు రాజా, లక్ష్మీ, ఉమాదేవి, డాటా ఎంట్రీ ఆపరేటర్ శివ తదితరులు పాల్గొన్నారు.