రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.. మోదీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం లోక్ సభలో ప్రసంగించారు. ఎన్నికల్లో విపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసిన వారికి ఓటమి తప్పలేదన్నారు. వికసిత్ భారత్ దిశగా రాష్ట్రపతి ప్రసంగం కొనసాగిందని, వికసిత్ భారత్ లక్ష్యంగా రాష్ట్రపతి మార్గదర్శనం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారు. సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే అన్నారు. ప్రదాని మోదీ ప్రసంగానికి అడ్డుతగులుతున్న విపక్షాలపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడం సబబు కాదని, ప్రతిపక్ష నేతను తీవ్ర స్వరంతో సభను తప్పుదోవ పట్టించవద్దని రాహుల్ గాంధీని స్పీకర్ హైచ్చరించారు. పదేళ్ల మా పాలన చూసి ప్రజలు మరోసారి తీర్పు ఇచ్చారని మోదీ చెప్పారు. పదేళ్లలో 25 కోట్లమంది పేదలను దారిద్ర్యరేఖ నుంచి బయటకు తెచ్చామని, అవినీతి రహిత పాలన అందించామని ఆయన వెల్లడించారు. ఇవాళ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని, భారత్ ప్రథమ్ అనే మా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా భారత్ ప్రథమ్ కేంద్రంగానే తీసుకుంటామని, మేం ప్రవేశపెట్టిన పథకాలు అట్టడుగు వర్గాలకు చేరాలనేదే మా విధానామని మోదీ తెలిపారు.






