గ్రామసభలో అభివృద్ధి పనులపై తీర్మానాలు
దోమకొండ, ఆగస్టు 13 (విజయక్రాంతి): సర్పంచ్ ఐరనీ నరసయ్య అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. 202627 ఆర్థిక సంవత్సరానికి రానున్న సుమారు రూ.56 లక్షల నిధులకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇందులో రూ.28 లక్షలను శానిటేషన్, వాటర్ సప్లైకు, మరో రూ.28 లక్షలను విద్యుత్, డ్రైనేజీ మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులకు కేటాయించాలని తీర్మానించారు.
ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి బ్యాంకు, శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేయడంతో పాటు ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు.బాలల పోషణ, విద్య, రక్షణ, సమగ్ర అభివృద్ధిపై అవగాహన కల్పించాలని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు గ్రామస్థులు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మర శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, సీతారాం మధు, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






