27 May, 2026 | 1:32 AM

ఇరిగేషన్‌లో ‘రిటెన్షన్’!

27-05-2026 12:41 AM
  1. నీటిపారుదల శాఖలో వివాదా స్పదమవుతున్న బదిలీల వ్యవహారం
  2. సుదీర్ఘకాలంగా ఒకే చోట అధికారుల తిష్ట
  3. నిలుపుదల చేయించుకునేందుకు ప్రయత్నాలు
  4. కులగణన డ్యూటీ, ఫీల్ సర్వేలంటూ సాకులు  
  5. రిటెన్షన్ విధానాన్ని అస్త్రంగా వాడుకుంటున్న వైనం
  6. రాజకీయ పైరవీలు, సిఫారసులు.. ఒత్తిడిలో ఉన్నతాధికారులు 

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి) : రాష్ట్ర నీటిపారుదల శాఖలో బదిలీల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ప్రతి ఏడా ది మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం సాధారణ బదిలీల ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, చోటు చేసుకుంటున్న పరిణామా లు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

ముఖ్యం గా శాఖలో పదేళ్లకు పైగా ఒకే చోట పని చేస్తున్న అధికారులు ఇంకా అక్కడే ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ‘రిటెన్షన్’ అస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు  వినిపిస్తున్నాయి. సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో, పరిపాలనా అవసరాల నేపథ్యంలో కొందరు అధికారులను తాత్కాలికంగా అదే స్థానంలో కొనసాగించేందుకు మాత్రమే రిటెన్షన్ విధానం ఉపయోగిస్తారు. కానీ, అదే రిటెన్షన్ వ్యవస్థను కొందరు శాశ్వత రక్షణ కవచంలా మార్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

కులగణన విధుల్లో లేకున్నా ఉన్నట్లుగా..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన, ఫీల్ సర్వే కార్యక్రమాలను కొందరు అధికారులు సాకుగా వాడుకుంటున్నారు. తమను మధ్యలో బదిలీ చేస్తే పని దెబ్బతింటుందని, రిటెన్షన్ కోసం దరఖాస్తులు పెడుతున్నారని సమాచారం. అయితే కులగణన విధుల్లో పాల్గొంటున్న అధికారులు కొందరే కాగా..  ఆ పేరుతో రిటెన్షన్ కోరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు కులగణన విధుల్లో లేకపోయినా, రాజకీయ ప్రభావంతో సర్టిఫికెట్లు తెచ్చుకొని బదిలీలను నిలుపుదల చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) విభాగంలోని కొందరు ఇంజినీర్లు పది నుంచి పన్నెండు సంవత్సరాలుగా అదే విభాగంలో కొనసాగుతున్నా వారికి రిటెన్షన్ ఇవ్వడం.. ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. భారీగా నిధులు తిరిగే ప్రాజెక్టులు, రీడిజైన్లు, ఎస్టిమేట్లు, కాంట్రాక్టులు ఉండే చోట నుంచి వెళ్లేందుకు వారు సిద్ధంగా లేరన్న విమర్శలున్నాయి.  కొందరు అధికారులు స్థానిక రాజకీయ నాయకులతో అనుబంధం పెంచుకొని, అక్కడి కాంట్రాక్టర్ వ్యవస్థతో కలిసి పనిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో బదిలీ ఆదేశాలు వచ్చినా చివరి నిమిషంలో రద్దు చేయించుకోవడం, లేదా వెయిటింగ్‌లో పెట్టించుకోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయని సమాచారం. 

తలనొప్పిగా బదిలీ జాబితా తయారీ 

ఇరిగేషన్ శాఖలో బదిలీల జాబితా సిద్ధం చేయటం ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, ప్రజాప్రతినిధుల సిఫార్సులు, సంఘాల విజ్ఞప్తులతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టు కోసం భారీ స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయని, కొందరు మధ్యవర్తులు రిటెన్షన్ గ్యారంటీ, పోస్టింగ్ ఫిక్స్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

క్షేత్రస్థాయి ఇంజినీర్లలో అసంతృప్తి

శాఖలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పలువురు యువ ఇంజినీర్లు, మధ్యస్థాయి అధికారులు తాజా పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో  ఉన్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్నవారికి రక్షణ, కొత్తగా వచ్చినవారికి మాత్రం వరుస బదిలీలు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ప్రమోషన్లు, పోస్టింగులు, బదిలీలు అన్నీ పారదర్శకంగా ఉండాలని,  అందరికీ ఒకే విధానం వర్తించాలని, రిటెన్షన్ వ్యవస్థపై పూర్తి సమీక్ష చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిణామాలు ప్రభుత్వానికీ తలనొప్పిగా మారుతున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అవినీతి రహిత పాలన, పారదర్శక పరిపాలన అంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంటే, మరోవైపు కొందరు అధికారులకు ప్రత్యేక రక్షణ లభిస్తోందని, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో రిటెన్షన్ రాజకీయం ప్రభుత్వ ప్రతిష్టకు ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీనియారిటీ, నిబంధనల మేరకే కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని, సుదీర్ఘకాలంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఇంజినీర్లకు హైదరాబాద్, ఇతర ప్రధాన కార్యాలయాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని, ఈ బదిలీలపై సీఎం, మంత్రి తక్షణమే దృష్టి సారించి శాఖను ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.