దొంగగా మారిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి
- 4న డాక్టర్ ఇంట్లో దోపిడీ
9 మంది అరెస్ట్
20 లక్షల సొత్తు రికవరీ
సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 9 : సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బూరుగుపల్లి ’చెర్వితా మెడోస్’లో ఈ నెల 4న ఓ డాక్టర్ ఇంట్లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులైన 9 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
బెల్లంపల్లికి చెందిన నరేంద్రుల శ్రీకాంత్ అలియాస్ క్రాంతి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం రామగుండం ఐవోసీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించాలని దోపిడీకి పథకం వేశాడు. తన స్నేహితులైన రాజేష్, శ్యామ్, చంద్రశేఖర్లతోపాటు ములుగు, భద్రాచలం ప్రాంతాల్లో నేర చరిత్ర కలిగిన గణేష్, ప్రేమ్ చంద్, పవన్ ముఠాగా ఏర్పడ్డారు.
ఈ నెల 4న నిందితులు రెక్కీ నిర్వహించి, రాత్రి 8 గంటలకు డాక్టర్ ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలను కత్తులతో బెదిరించి 8.6 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ఫోన్లను ఎత్తుకెళ్లారు. బాధితులను చార్జింగ్ కేబుల్స్, టవల్స్తో కట్టివేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులను పట్టుకోవడానికి సీపీ 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4.3 తులాల బంగారు ఆభరణాలు,
ఒక యమహా బైక్, ఒక మారుతి డిజైర్ కారు, 10 మొబైల్ ఫోన్లు, రూ.50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో సమన్వయంతో పనిచేసిన ఏసీపీ ఎం.రవీందర్ రెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ ఎం.శ్రీను, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ రవీందర్, ఎస్త్స్రలు తిరుపతి, రాజేష్, చంద్రమోహన్, వివేక్, సౌజన్య, శరత్ (ఫింగర్ ప్రింట్ టీం), ఇతర సిబ్బంది ఎం.రాజు, సుభాష్, యాదగిరి, స్వామి, ఐటీ సెల్ బృందం రమేష్ , శ్రీకాంత్ లను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.




