మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
మెదక్, ఏప్రిల్ 9(విజయ క్రాంతి) : మెదక్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తనిఖీ చేశారు. మొదటగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన పరిశుభ్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ, ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీసీ కెమెరాల పనితీరుపై ఎస్హెచ్‌ఓ మహేష్ నుండి వివరాలు తెలుసుకొని, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజూ సాయంత్రం వాహనాల తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బందితో సమావేశం నిర్వహించిన ఎస్పి విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని హితవు పలికారు. ఎస్పీ వెంట మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, ఎస్బి ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎసై లు మల్లికార్జున్, విఠల్ సిబ్బంది ఉన్నారు.




