వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి
సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా వారం రోజుల నిరసనలు
420 హామీల అమలు కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తాం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్,(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో “సమరభేరి” కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
వారం రోజుల కార్యచరణ ఆయన ప్రకటించారు
సెప్టెంబర్ 2: హుజూరాబాద్‌లో భారీ ధర్నా, బాకీల కార్డు పంపిణీ, 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన.
సెప్టెంబర్ 3: వీణవంకలో రైతు సమస్యలపై నిరసన.
సెప్టెంబర్ 4: కమలాపూర్‌లో మహిళల హామీల అమలుకు వంటావార్పు.
సెప్టెంబర్ 5: జమ్మికుంటలో యువత, విద్యార్థుల సమస్యలపై ఆందోళన.
సెప్టెంబర్ 6: గ్రామపంచాయతీలు, ఆటో కార్మికుల నిరసనలు.
సెప్టెంబర్ 7: ఐదు మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాలు.
సెప్టెంబర్ 8: కరీంనగర్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రంతో ముగింపు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టే ఈ పోరాట కార్యక్రమాలను ప్రజలు, రైతులు,b మహిళలు, యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపక శ్రీనివాస్, పింగిలి రమేష్ రమేష్ తోపాటు నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పిటిసిలు కార్యకర్తలు పాల్గొన్నారు.






