టీచర్ల బదిలీలు, పదోన్నతులు నేటి నుంచే
టెట్‌తో సంబంధం లేకుండానే ప్రమోషన్స్
పదవీ విరమణ 3 ఏళ్లలోపు ఉన్న వారికి
తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు
కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో
అక్కడి నుంచే ప్రారంభం l 23 రోజుల్లో ప్రక్రియ పూర్తి
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎట్టకేలకు ఉపాధ్యా యుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యింది. ఈనెల 8 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల పక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ 3 ఏండ్లలోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వను న్నారు.
మల్టీజోన్ శనివారం నుంచి ఈనెల 22 వరకు, మల్టీజోన్ శనివారం నుంచి ఈనెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. టెట్‌తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతులు జరగనున్నాయి. పండిట్, పీఈటీ పోస్టులలో అప్‌గ్రెడేషన్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మల్టీజోన్ హెచ్‌ఎం ప్రమో షన్, మల్టీజోన్ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌తో షెడ్యూల్ మొదలు కానుంది. రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు.
ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 19 వేల మంది ఉపాధ్యాయులు పదోన్నతులు, 50 వేల నుంచి 60 వేల మంది బదిలీలు కానున్నారు. 23 రోజుల్లో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యూల్‌ను అధికారులు రూపొందించారు. తేదీల వారీగా పూర్తి షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచారు. ఈనెల 8, 9 తేదీల్లో సినియారిటీ లిస్టును పెట్టాలి. 10, 11 తేదీల్లో డీఈఓలకు ఫిర్యాదులు సమర్పించడం, పదోన్నతులు పొందిన వారి వివరాలను ఈనెల 12న డిస్‌ప్లే చేయడం, వెబ్‌ఆప్షన్లను 13, 16వ తేదీల్లో చేసుకునేలా అవకాశం కల్పించారు. 18 నుంచి 20 వరకు తుది జాబితాను పొందుపర్చాల్సి ఉంటుం ది. 21, 22 తేదీల్లో బదిలీలు చేయనున్నారు.
గతేడాదిలో ఏం జరిగిందంటే..
గతేడాదిలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పదోన్నతులు, బదిలీలు చేపట్టారు. అయితే పదోన్నతులకు టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరని సెప్టెంబర్‌లో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. దీంతోపాటు జీవో 317 వల్ల ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావడంవల్ల తమ సినియారిటీ దెబ్బతింటుందని రంగారెడ్డి జిల్లా ఉపాధ్యా యులు కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అప్పటికే మల్టీజోన్ గెజిటెడ్ హెచ్‌ఎఓంలుగా పదోన్న తులు, బదిలీలు పూర్తయ్యాయి. 782 మంది పదోన్నతులు కూడా పొందారు. స్కూల్ అసిస్టెంట్ బదిలీలు పూర్తయ్యాయి. కానీ పదోన్నతులు పూర్తి కాలేదు. ఎస్జీటీల బదిలీలు కూడా ఆగిపోయాయి.
మల్టీజోన్ లో కేవలం ప్రభుత్వ పాఠశాలలో గెజిటెడ్ హెచ్‌ఎంల బదిలీలు, పదోన్నతులు పూర్తయ్యాయి. 147 మందికి పదోన్నతులు దక్కాయి. స్థానిక సంస్థల పాఠశాలల జీహెచ్‌ఎంల బదిలీలు ముగిశాయి. మిగిలిన వారివి ఆగిపోయాయి. ఈక్రమంలో అప్పటి నుంచి నేటి వరకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియను చేపట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈప్రక్రియను ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంది. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ఖరారు కావడంతో పీఆర్టీయూటీఎస్, పీఆర్టీయూతెలంగాణ, హెచ్‌ఎం అసోసియేషన్ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి.






