11-11-2025 12:43:23 AM
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాం తి): జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యాంరెటీలపై సమీక్ష పెట్టారని, ఇది జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని మాజీ మం త్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి రెండేళ్లుగా ఆరు గ్యారెంటీలపై సమీక్ష చేయడానికి సమయం దొరకలేదా? పోలింగ్‌కు ఒక్క రోజు ముందు సమీక్ష సమావేశం పెట్టడం ఎందుకని ప్రశ్నించారు.
మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సార్లు కేబినెట్ సమావేశం జరిగినా, అసెంబ్లీ జరిగినా ఆరు గ్యారెంటీలపై ఏనాడూ రివ్యూ చేయలేదని గుర్తు చేశారు. హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నేతలు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భం గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని ఫిర్యాదు చేశారు.
అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహించజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపి ణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోందని ఆరోపించారు. వీడియోలు, ఫొటోలతో సహా ఎలక్షన్ కమిషన్ కు సమర్పించినట్టు వివరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు పేర్కొన్నారు.
కొంత మంది పోలీస్ అధికారులు, ఇతర అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు తగిన రీతిలో కాంగ్రెస్‌కు బుద్ధి చెపుతారని పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ బూతుల్లో కేంద్ర బలగాలను పెట్టాలని కోరారు.
ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లను అక్కడ నియమించి లోపలికి వెళ్లే ఓటర్ల గుర్తింపు కార్డులను గమనించిన తర్వాతనే అనుమతించాలని కోరారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకులు ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేశారని, ఫేక్ ఐడీ కార్డుల వీడియోను ఎన్నికల ప్రధాన అధికారి అందించినట్టు హరీశ్‌రావు వివరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసి ఎలక్షన్ అబ్జర్వర్లకు కూడా ఫేక్ ఐడీ కార్డులను అందించిందని, ఆ వివరాలను కూడా సమర్పించినట్టు పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం చేసిన అధికారులపై తప్పకుండా చర్యలు చేపడతామని ఎన్నికల ప్రధాన అధికారి హామీ ఇచ్చినట్టు హరీష్‌రావు చెప్పారు. యూసుఫ్‌గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆనుకుని పోలింగ్ బూత్ ఉన్నదని, పార్టీ కార్యాలయం పక్కన పోలింగ్ బూత్ ఎలా పెడతారని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డి మోకాళ్లపై తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి దివా లాకోరు రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్ని డ్రామా లాడినా జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో ముందే నిర్ణయించుకున్నారని హరీశ్‌రావు స్పష్టం చేశారు.