15 July, 2026 | 11:26 PM

కాంగ్రెస్ గెలుపులో రేవంత్ పాత్రే లేదు!

07-06-2024 02:45 AM

ఆయన అత్యంత విఫల ముఖ్యమంత్రి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 8 పార్లమెంట్ స్థానాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర మచ్చుకైనా లేదని, అక్కడ ఆయా నేతలు, మంత్రులు, కమ్యూనిస్టుల వల్లే ఆ పార్టీ విజయం సాధించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ, ఇప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత వైఫల్యం చెందిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ మాత్రమేనని ఎద్దేవా చేశారు.

గురువారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయారని, తన సిట్టింగ్ స్థానం మల్కాజ్‌గిరిలో, సొంత జిల్లా పాలమూరులోనూ ఎంపీ స్థానాలు గల్లంతు అయ్యాయని తెలిపారు. ఓడిపోయినా ఆయనకు కాంగ్రెస్ పార్టీ సీఎంగా అవకాశం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ గెలిచిన 8 స్థానాల్లో రేవంత్ రెడ్డి పాత్ర లేనేలేదని... గెలిచిన ఒక్క అభ్యర్థి కూడా సీఎం వల్ల తాను గెలిచానని అనడం లేదన్నారు. ఇకనైనా రాజకీయాలు మాని, పిచ్చి మాటలు మాట్లాడటం ఆపేయాలని హెచ్చరించారు.

రాష్ట్రంలో విత్తనాల కోసం రైతులు బారులు తీరుతున్నారని, ఖరీఫ్ వచ్చినా కల్తీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. విద్యుత్ కొరతతో అన్నదాతలు సతమతమవుతుంటే స్పందించాల్సిన ప్రభుత్వ పెద్దలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి పడినందునే 8 స్థానాలు గెలిచిందని సీఎం ప్రగల్బాలు పలకడం సిగ్గుచేటని అన్నారు. ఖమ్మం, నల్గొండలో తమ వల్లే గెలిచారని కమ్యూనిస్టులు అంటున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పేరిట బీఆర్‌ఎస్‌ను బ్లాక్ మెయిల్ చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ది పొందిందని ఆయన విమర్శించారు. ఇకనైనా రాజకీయాలు మాని పరిపాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.