15 July, 2026 | 11:47 PM

నేటి నుంచి ప్రపంచ వరి సదస్సు

07-06-2024 02:44 AM

తాజ్‌కృష్ణలో రెండు రోజులపాటు నిర్వహణ

30 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి ప్రపంచ వరి సదస్సు ప్రారంభంకానుంది. అంతర్జాతీయ కమోడి టీస్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హోటల్ తాజ్‌కృష్ణలో శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తున్నాయి. ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వ రరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నారు.

సదస్సులో అంత ర్జాతీయ వరి పరిశోధన సంస్థల కన్సార్షియం, భారతదేశ వరి పరిశోధన సంస్థ, యూపీలోని చంద్రశేఖర్ ఆజాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఒడిశా విశ్వవిద్యాలయం, భారతదేశ వరి ఎగుమతిదారుల  సమాఖ్య, ఫిక్కి ప్రతినిధులతోపాటు దాదాపు 30 దేశాల నుంచి వరి ఎగుమతి, దిగుమతిదారులు, రాష్ట్రంలోని అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొననున్నారు.

సదస్సుకు భారత్ అతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. వరి ఉత్పత్తిలో అగ్రభాగంలో ఉన్న తెలంగాణను వేదికగా ఎంచుకుంది. ఆహార భద్రత, సాగుకు సాంకేతిక సాయం, బియ్యం మార్కెటింగ్ విశ్వవ్యాప్తం చేయడం, ఎగుమతుల పెంపు లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. వరి సాగులో ఎరువుల వాడకం తగ్గింపు, వాతావరణ పరిస్థితులు అధిగమించేలా సాగు, సాంకేతిక వినియోగం వంటి అంశాలపై చర్చించనున్నారు.