రేవంత్‌రెడ్డికి ఆ అర్హత లేదు
ఆయన ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు
సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించే అర్హత లేదని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రేవంత్‌రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం యాదగిరి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం నాటి కాంగ్రెస్ నేతలు, ప్రస్తుత మంత్రి పొన్నంప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, చిన్నారెడ్డి లాంటి నాయకులు కొందరు ఉద్యమం చేశారని గుర్తుచేశారు. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్ అంటే తమకు గౌరవం ఉందన్నారు.
కానీ రెండు కళ్ల సిద్ధాంతం పేరు చెప్పే నాయకుడికి శిష్యుడిని అని చెప్పుకునే రేవంత్‌రెడ్డికి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించే కనీస అర్హత లేదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తుందని అన్నారు. ద్రోహం చేసిన వారిని సన్మానిస్తున్నారని, తెలంగాణ ఉద్యమకారులను కర్రలతో కొట్టిన దానం నాగేందర్‌ను, వందల ఎకరాలు కబ్జా చేసిన మైనంపల్లి లాంటి వాళ్లను అక్కున చేర్చుకుంటున్నారని అన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణం చేసిన ఎక్క యాదగిరి, సికింద్రాబాద్ క్లాక్ టవర్ అమరుల స్థూపం నిర్మించిన సింహా పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అలాంటి వారిని సన్మానించకుండా తెలంగాణ ద్రోహులకు ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారని అన్నారు.
అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా సంగీత దర్శకుడితో పాడిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమద్రోహులకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ లోగోలో చాకలి ఐలమ్మ బొమ్మ పెట్టాలన్నారు. కనీసం ఒక కమిటీ కూడా వేయకుండా ఏకపక్ష నిర్ణయాలను సీఎం తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వారిపై ఉన్న కేసులను ఎత్తివేయాలని, అందుకు ఒక కమిటీ వేయాలన్నారు. జూన్ 2లోపు కేసులు ఎత్తివేయకుంటే ఆవిర్భావ వేడుకల నిర్వహణ బాధ్యతల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి తప్పుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అమరుల కుటుంబాలకు న్యాయం జరగకుండా ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే ఆయనను సైతం విమర్శిస్తామని అన్నారు.






