ఇసుక ట్రిప్పుల పెంపుపై పరిశీలన
కలెక్టర్ రాజర్షి షా వెల్లడి
ఆదిలాబాద్, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక రవాణాలో ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఇందిరమ్మ ఇంటికి 8 ట్రిప్పుల వరకు ఇసుక పొందే అవకాశం ఉందని, అవసరమైతే దీనిని 10 నుండి 12 ట్రిప్పులకు పెంచే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇసుక బుకింగ్, రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన ఇసుక వాహనం పోర్టల్ పై అవగాహన, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా రిజిస్ట్రేషన్, బుకింగ్ విధానంపై హైదరాబాద్ నుండి cgg- కోఆర్డినేటర్ నరేష్ వర్చువల్ విధానం ద్వారా అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక బుకింగ్ సమయంలో సరైన పత్రాలను అప్లోడ్ చేయడం తప్పనిసరని స్పష్టం చేశారు. బిల్డింగ్ పర్మిషన్ వంటి పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు.






