6 May, 2026 | 4:05 AM

సాగు విధానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి

06-05-2026 02:48 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, మే 5 (విజయక్రాంతి): జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో సాగు విధానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకరావాలని, ముఖ్యంగా రైతులకు అధిక ఆదాయం అందించే పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన రైతు వారోత్సవాలలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయం కేవలం సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచే విధంగా ఆధునీకరణ చెందాలన్నారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి, క్షేత్రస్థాయిలో రైతుల్లో అవగాహన పెంపొందించాలన్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ పామ్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచాలన్నారు. మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని, లబ్ధిదారుల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో నీటి వసతి పుష్కలంగా ఉన్న నేపథ్యంలో, కూరగాయల సాగును లాభసాటిగా మార్చాలని కలెక్టర్ పేర్కొన్నారు. కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణను జోడించి శ్రమను తగ్గించి దిగుబడిని పెంచాలన్నారు.

కృషి విజ్ఞాన కేంద్రం (కెవికె) ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలన్నారు. వరి ఒక్కటే కాకుండా, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి, అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హర్టికల్చర్ నాగయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెట్ అధికారి నాగేశ్వర శర్మ, కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ దొంగరి నరేష్, తహసిల్దార్ కృష్ణయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.