17-05-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, మే 16 :జిల్లాలో కొనుగోలు కేంద్రాల నుంచి కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించిన వరిధాన్యం లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ మీటింగ్ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన వరిధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలోని రైస్ మిల్లుల సామర్థ్యానికి అనుగు ణంగా కేటాయించిన ప్రకారం ధాన్యం తరలించడం జరుగుతుందని తెలిపారు.
రైస్ మిల్లులకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని, సి.ఎం.ఆర్. ప్రక్రియ వేగవంతం చేయాలని రైస్ మిల్లర్ల కు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.