23-08-2025 11:10:08 AM
సదాశివనగర్,(విజయక్రాంతి): అనుమానం సొంత భార్యను కడతేర్చిన స్థాయికి తెచ్చిన ఘటన సదాశివనగర్ మండల(Sadashivanagar Mandal) కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి మండల కేంద్రంలో ని జ్యోతి నగర్ కాలనీ చెందిన చిందం లక్ష్మి అలియాస్ లింగవ్వ (40) మహిళను ఆమె భర్త చిందం రవి హత్య చేసిన సంఘటన వెలుగుచుసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసిన దానిప్రకారం, ఘటన జరిగిన రాత్రి భర్త రవి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య వంట చేస్తుండగా, దంపతుల మధ్య తగాదా చోటుచేసుకున్నట్లు, ఆ సమయంలో భార్య భర్తను కొట్టిన కారణంగా కోపానికి గురైన భర్త రవి సమీపంలో ఉన్న రాయితో భార్యను దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మృతిచెందినట్టు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు – పెద్ద కుమారుడు సురేష్ (వయస్సు 21) హైదరాబాద్‌లో ఉండగా, చిన్న కుమారుడు మహేష్ (వయస్సు 19) దుబాయ్‌లో పనిచేస్తున్నారు. సంఘటన పై వారికి సమాచారం అందజేసినట్టు తెలిపారు. సంఘటన స్థలానికి సి ఐ సంతోష్ కుమార్ హాజరై, క్లూస్ టీమ్ ద్వారా ఫోటోగ్రఫీ, ఆధారాల సేకరించారు. మృతదేహాన్ని శవ పంచనామా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్టు ఎస్ ఐ పుష్పరాజ్ తెలిపారు.