03-12-2025 08:31:28 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ (విజయక్రాంతి): రైతులు విక్రయించిన ధాన్యంలో తరుగు తీయకుండా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దింపుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో కస్టమ్ మిల్లింగ్ రైస్, ధాన్యం కొనుగోలు అంశాలు, జిల్లాలోని ధాన్యం కోనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించినప్పుడు రైస్ మిల్లర్లు ధాన్యపు బస్తాలలో ఎక్కువగా తరుగు తీస్తున్నారని, తరుగు తీస్తుండడంతో నష్టపోతున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన అంశంపై పౌరసరఫరాలు శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం కేటాయించిన ప్రకారం మిల్లర్లు నిర్దేశిత సీఎంఆర్ లక్ష్యం చేరుకున్నారా అని, ఏ మిల్లుకు ఎంత ధాన్యం కేటాయించారు అనే వివరాలు తెలుసా అని మిల్లర్లను కలెక్టర్ అడిగారు. మిల్లులకు కేటాయింపు ప్రక్రియ ఎలా చేస్తున్నారు అని అధికారులను అడిగి తెలుసుకున్నాను.
రైతులు విక్రయించిన ధాన్యంలో ఎందుకు తరుగు తీస్తున్నారని మిల్లర్లను అడిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ రైతులు విక్రయించిన ధాన్యంలో ఎక్కువ తరుగును తీస్తున్నారనే విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. తరుగు లేకుండా ధాన్యపు బస్తాలను రైస్ మిల్లర్లు తమ మిల్లుల వద్ద దింపుకోవాలన్నారు. తరుగుతో రైతులను మిల్లర్లు ఇబ్బంది పెట్టొద్దన్నారు. సన్న, దొడ్డు రకాలు అనే వ్యత్యాసం లేకుండా ధాన్యాన్ని మిల్లర్లు దింపుకోవాలన్నారు. 2024- 25 నిర్దేశిత సీఎంఆర్ లక్ష్యాన్ని మిల్లర్లు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
మిల్లర్లు ధాన్యం దింపిన వెంటనే ఆన్లైన్లో అక్నాలెడ్జ్మెంట్ను ఇవ్వాలన్నారు. జిల్లాలో ఏ మిల్లుకు ఎంత ధాన్యం కస్టమ్ మిల్లింగ్ కు ఇచ్చారనే వివరాల జాబితా ను మిలర్ల కు అందజేయాలన్నారు. ధాన్యం కేటాయింపు పారదర్శకంగా చేయాలని అధికారులకు సూచించారు. ఏయే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏయే మిల్లులకు అలాట్ అయ్యాయనే వివరాలు మిల్లర్లకు తెలియాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎండి. వాజిద్ అలీ, సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.