రామనవమి, పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు
ఎస్పీ రోహిత్ రాజు
భద్రాచలం, మార్చి 25, (విజయక్రాంతి): ఈ నెల 27వ తారీకున భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం,మిథిలా స్టేడియంలో జరగనున్న రామనవమి మరియు మరుసటి రోజు 28న జరగనున్న పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. సెక్టార్ల వారీగా ఇన్చార్జ్ అధికారులు తమ క్రింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ విషయంలో పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసారు.
సుమారుగా 2000 మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలియజేసారు.భక్తుల కొరకు పార్కింగ్ స్థలాలు,లడ్డూ కౌంటర్లు,సెక్టార్ల వివరాలను తెలియజేస్తూ జిల్లా పోలీసుల తరపున ప్రత్యేకంగా ఒక QR కోడ్ ను, అదేవిదంగా ఆన్లైన్ లింకు (https://ramanavami.4 sightai.com/)ను రూపొందించడం జరిగిందని తెలిపారు.కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు.




